Cinematic Incarceration: ‘Jailer’ Movie Review – A Compelling Story of Life and Choices”
తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు ఎదురుచూసిన జైలర్, ఆగష్టు 10 వ తారీఖున మన అభిమాన థియేటర్స్ లో సందడి చేసింది. మొదటి షో నుంచే మంచి రిపోర్ట్స్ వచ్చిన జైలర్ మూవీ గురించి, ‘ఫిల్మ్ కంబాట్’ జెన్యూన్ రివ్యూ.
రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
నటీనటులు: రజనీకాంత్, రమ్య కృష్ణ, వినాయకన్, వసంత్ రవి, యోగి బాబు, తమన్నా, సునీల్, మారిముత్తు తదితరులు
నిర్మాత: కలానిథి మారన్
సంస్థ: సన్ పిక్చర్స్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
కోరియోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నిర్మల్
విడుదల తేదీ: 10/జులై/2023
కథ:
టైగర్ ముట్టువేళ్ పాండ్యన్ (రజనీకాంత్) ఒక రిటైర్డ్ జైలర్. అయన కొడుకు అర్జున్ (వసంత్ రవి) నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. దేశంలో ప్రముఖ దేవాలయాల విగ్రహాలను దొంగతనం చేసే ముఠాని పట్టుకునే ప్రయత్నంలో తన ప్రాణాలని కోల్పోతాడు. ఆ బాధని తండ్రి తట్టుకోలేక, ఆ ముఠాకి సంబందించిన ముగ్గురు వ్యక్తులని హత్య చేస్తాడు. అది తెలిసిన, ఆ ముఠా నాయకుడు వర్మన్ (వినాయకన్), ముట్టువేళ్ పాండ్యన్ కుటుంభం మొత్తాన్ని చంపటానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం విఫలం అవ్వడంతో, ఒక విలువైన వస్తువుని దొంగలించి ఇవ్వాలని ‘వర్మన్’ షరతు పెడతాడు.
టైగర్ ముట్టువేళ్ పాండ్యన్ అడిగిన పని చేశాడా? అసలు కామ్నా(తమన్నా), బ్లాస్ట్ మోహన్ (సునీల్) కి మధ్య సంబంధం ఏంటి? టైగర్ ముట్టువేళ్ పాండ్యన్ కి నరసింహ (డా. శివరాజ్ కుమార్ ), మాథ్యూ(మోహన్ లాల్), కందేవ్ (జాకీ ష్రాఫ్) మధ్య ఎలాంటి సంబంధం ఉంది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పెర్ఫార్మన్స్:
టైగర్ ముట్టువేళ్ పాండ్యన్ గా సూపర్ స్టార్ట్ రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా తన నటనతో, స్టైల్ తో అదరకొట్టారు. ఒక బాధ్యత గల పౌరుడిగా తన ఉద్యోగ కర్తవ్యం, తండ్రిగా బాధ్యతలు, తాతగా తన మనవడితో చేసే చేష్టలతో, అన్ని వర్గాలవారిని ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. భార్యగా నటించిన రమ్య కృష్ణ గారు తన పరిధి వరుకు నటించి మెప్పించారు. కొడుకుగా నటించిన వసంత్ రవి, పాత్రకి తగ్గ న్యాయం చేసారు. తమన్నా, సునీల్, యోగి బాబు వాళ్ళకి ఇచ్చిన పాత్రలను మంచిగా వినియోగించుకున్నారనే చెప్పాలి. రజనీకాంత్ గారికి మరియు యోగి బాబు గారికి మధ్య నడిచే, కొద్దిపాటి హాస్య సన్నివేశాలు అలరించాయి. ఇదివరకు చిత్రాలలో నటించిన చాలామంది నటీనటులను దర్శకుడు ఈ చిత్రంలో చక్కగా ఉపయోగించుకున్నారు. రజనీకాంత్ గారి తర్వాత అంతగా మారుమోగింది ఒకే ఒక్క పేరు వినాయకన్. ప్రతినాయకుడి పాత్రలో విలక్షణమైన నటనతో మెప్పించారు. దర్శకుడు ప్రతినాయకుడితో కూడా చూపించిన చిన్నపాటి హాస్యం అందరిని మెప్పించింది.
సాంకేతిక వివరాలు :
దర్శకుడు నెల్సన్ తన పూర్వ చిత్రం ‘బీస్ట్’ తర్వాత తన కెరీర్ ని నిలబెట్టుకునే ప్రయత్నంలో తీసిన జైలర్ అందరిని మంచిగా ఆకట్టుకుందనే చెప్పాలి. నెల్సన్ తాను అనుకున్న పద్దతిని అన్ని వర్గాలవారికి నచ్చేలా చిత్రీకరించారు. కథ అంత కొత్తగా లేకపోయినప్పటికీ అందరిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ప్రతిష్టాత్మక సంస్థ సన్ పిక్చర్స్ చాల పెద్ద మొత్తంలో నిర్మించినట్టు తెరపై కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే, సాంకేతిక హంగులకి ఎలాంటి లోటు లేకుండా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. ఈ చిత్రానికి మరొక ముఖ్యమైన ఆయుధం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్. అయన ఇచ్చిన పాటలు, రీరికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళాయి. ప్రోమోగా విడుదల చేసిన “కావాలయ్యా” సాంగ్ కి ఆదరణ లభించింది. ఛాయాగ్రాహకుడు మరియు ఎడిటర్ కూడా వాళ్ళ పనితనాన్ని బాగా చూపించారు.
ప్లస్ పాయింట్స్ :
రజని స్వ్యాగ్ ఈ సినిమాకి ఒక పెద్ద అస్సెట్. అయన స్టైల్ ఎప్పటికి అలానే ఉంటుంది అని మళ్ళీ నిరూపించారు. అతిధి మాత్రలో నటించిన డా. శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, జాకీ ష్రాఫ్ గారు వాళ్ళ పాత్రలకి న్యాయం బాగా చేసారు. సినిమాకి మంచి హైప్ రావటానికి వాళ్ళు కూడా మంచి పాత్ర పోషించారు. వినాయకన్ విలనిజం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. “కావాలయ్యా” పాట, యోగి బాబు కామెడీ, చాలా ఆకట్టుకున్నాయి. సునీల్ గారు కూడా అయన పాత్రకి తగ్గ న్యాయం చేసారు. సినిమా కి క్లైమాక్స్ ప్రాణం పోసింది. తండ్రి కొడుకుల బంధం చాలా మంచిగా చూపించారు దర్శకులు. మనవడితో రజని సార్ కి ఉన్న సన్నివేశాలు అలరించాయి. అనిరుద్ మ్యూజిక్ సన్నివేశాలకి బాగా హైప్ ని , ఎనర్జీని ఇచ్చింది.
మైనస్ పాయింట్స్:
సినిమా చూస్తున్నంత సేపు తెలిసిన కధే కథ అనిపిస్తుంది. ఒక కొత్త కథని చూసినట్టుగా అనిపించదు. వసంత్ రవి పాత్రకి హావభావాలు ఇంకా మంచిగా ఇచ్చి ఉంటె బాగుండేది అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ లో రజిని సత్తాని చాటే బలమైన ఎపిసోడ్స్ లేకపోవటం అభిమానులని కాస్త నిరాశపరిచింది. సునీల్ ని ఇంకొంచెం బెటర్ గా చూపించి ఉంటే ఎంగేజింగ్ గా ఉండేది. కొన్ని సన్నివేశాలు సాగదీత గా అనిపించేలోపు అనిరుద్ తన మ్యూజిక్ తో సన్నివేశాన్ని హైప్ చేసే పరిస్థితి కనిపించాయి.
రేటింగ్: 3.25/5
Bottom line: జైలర్… బాక్స్ఆఫీస్ ఊచకోత!!!
Review By: సాయిరామ్ తాడేపల్లి