చిత్రం: ఉపేంద్ర గాడి అడ్డా
తేదీ: డిసెంబర్ 01, 2023
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ అడ్డా… ఈ ‘ఉపేంద్రగాడి అడ్డా’.
ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై తన కుమారుడు కంచర్ల ఉపేంద్రను హీరోగా పరిచయం చేస్తూ కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా నటించగా, కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత సహ నిర్మాతలు. (ఈరోజు) డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఉపేంద్ర అడ్డా ఏంటి.. అక్కడ ఏం జరుగుతుంది అనేది తెసుకోవాలంటే కథలోకి వెళ్లాలి.
బాధ్యత, బరువు లేకుండా హ్యాపీగా తిని తిరిగే బంజారాహిల్స్ బస్తీకి చెందిన యువకుడు ఉపేంద్ర. స్నేహితులతో కలిసి ఆ బస్తీని అడ్డాగా చేసుకుని తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లు సాగిపోతుంటుంది అతని జీవితం. ఇలాసాగుతున్న తరుణంలో అతని స్నేహితుడి సలహా మేరకు కోటీశ్వరుడి కూతురుని చూసి లైన్‌లో పెట్టి హై ఫై జీవితాన్ని అనుభవించాలనేది ఉపేంద్ర అండ్ కో ప్లాన్. ఇందు కోసం పక్క బస్తీలో ఉన్న ఓ రౌడీ షీటర్ దగ్గర అధిక వడ్డీకి అప్పు చేసి, పబ్బులు చుట్టూ తిరుగుతూ చివరకు సావిత్రి అనే అమ్మాయిని లైన్‌లో పెడతాడు. ఆమెకు తాను కోటీశ్వరుడి కొడుకునని అబద్ధం చెపుతాడు. ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి మెయింటెనెన్స్‌కు డబ్బు కోసం అప్పులు చేస్తారు. అలా కేవలం డబ్బుకోసమే ప్రేమించాలనుకున్న అతను సావిత్రని నిజంగానే ప్రేమిస్తాడు. దీంతో తన గురించి ఆమెకు నిజం చెప్పేస్తానని బయలుదేరుతాడు. ఉపేంద్ర తాను ప్రేమించిన అమ్మాయికి నిజం చెప్పేశాడా? ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యింది?. అలాగే దుబాయ్‌కి అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్న ముఠా చేతిలో చిక్కుకున్న తన చెల్లెల్ని, ప్రియురాల్ని ఎలా కాపాడుకున్నాడు? కోటీశ్వరుడు అవ్వాలనే తన ఆశను నెరవేర్చుకున్నాడా? అనేది వెండితెరమీద చూడాల్సిందే.
కథా పరంగా చూస్తే ఇదొక ఫక్తు కమర్షియల్ సినిమా. కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొందరు అమ్మాయిలను ఎలా వేధిస్తున్నారు. వారిని ఎలా ట్రాప్ చేస్తున్నారు అనే విషయాన్ని చర్చించటం ద్వారా సోషల్ మెసేజ్‌ను పాస్ ఆన్ చేశారు.
ప్లస్ పాయింట్స్ :
టైటిల్ రోల్ పోషించిన కంచర్ల ఉపేంద్ర డెబ్యూ మూవీతోనే తన వరకు సినిమాకు న్యాయం చేశాడు. పాటల విషయంలో కానీ.. ఫైట్స్, డైలాగ్స్ వంటి వాటిలో మాగ్జిమమ్ ఎఫర్ట్ పెట్టాడని చెప్పాలి. ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన కటౌట్‌తో పాటు, డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ బాగుండటం ఉపేంద్రకు కెరీర్‌కు కలిసివచ్చే అంశాలు. అలాగే అతను క్లోజప్‌లో నాగచైతన్యను, లాంగ్ షాట్స్‌లో తారకరత్నలను పలుమార్లు గుర్తు చేశాడు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. గురించి చెప్పాలంటే…
తొలి సినిమాతోనే కమర్షియల్ ఫార్మాట్‌ను చక్కగా ఫాలో అయ్యాడు.
ఉపేంద్ర నటిస్తున్న మరో 4 ప్రాజెక్ట్‌లు సెట్స్ మీద ఉండటం, అతని తొలి చిత్రం ఇదే కావడంతో దర్శకుడు సుభాన్ మీద బాధ్యత ఎక్కువగా పడిరది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తాను చెప్పాలనుకున్న మెసేజ్‌కు కమర్షియల్ బౌండరీస్ కరెక్ట్‌గా గీసుకుని వాటిని ఏమాత్రం క్రాస్ చేయకుండా చూసుకున్నాడు. హీరో ఇంట్రడక్షన్ సీన్ పోకిరి సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేసినట్లు ఉంది. అలాగే పాటల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్ వీలైనంత రిచ్‌గా కనపడేలా చూసుకున్నాడు. కెమెరా పనితనం, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్ వంటివి దర్శకుడికి 24 క్రాఫ్ట్స్‌పై ఉన్న పట్టును తెలియచేస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. దర్శకుడిగా తన కెరీర్‌తో పాటు కమర్షియల్‌గా ఉపేంద్ర కూడా మంచి బేస్ పడేలా చూసుకున్నాడు.
నిర్మాత కంచర్ల అచ్యుతరావు చిన్న సినిమా కదా అనే ఏదో చుట్టేసే పని పెట్టుకోకుండా కొడుకును కమర్షియల్ స్టార్‌గా నిలబెట్టుకోవటానికి తనవంతు ప్రయత్నం చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన పెట్టిన ఖర్చు మనకు కనపడుతుంది. ఊటీలో చేసిన డ్యూయెట్ సాంగ్, పబ్ సాంగ్స్, ఫైట్స్ వంటివి వాటికి పెట్టిన ఖర్చు మెచ్చుకోదగింది. తన కుమారుడితో మరో 4 సినిమాలు నిర్మిస్తుండడం కొడుకు నటనపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం.
ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే హీరోయిన్‌గా చేసిన సావిత్రికృష్ణ అటు రిచ్ అమ్మాయిగా, ఇటు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా తన నటనతో మెప్పించింది. రీల్స్ మోజులో పడి చిక్కుల్లో పడ్డ అమ్మాయిగా నటించిన హీరో చెల్లెలు పింకీ పాత్రధారి, హీరో తల్లి, తండ్రులు, అతని స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
మైనస్‌లు :
ఉపేంద్రకు కమర్షియల్ స్టార్‌గా బేస్ వేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు సోషల్ మీడియాకు సంబంధించి ఇచ్చిన మెసేజ్‌ను ఇంకొంత ఎన్‌లార్జ్ చేస్తే బాగుండేది. అలాగే ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కొంత లాగ్ అనిపించినప్పటికీ తరువాత వచ్చే సీన్‌తో దాన్ని కవర్ చేశాడు దర్శకుడు. మరో డ్యూయెట్ కూడా ఉంటే బాగుండేది.