కాలం , సమయం , ఖర్మ మన జీవితాలని శాసిస్తాయి. మనం ఎలాంటి స్థాయిలో ఉన్నాకూడా మనం చేసిన ఖర్మ మనల్ని వదలదు. తరాల తరబడి వెంటాడుతూనే ఉంటుంది . దూత అలంటి ఖర్మ సారాంశం . విలక్షణ కథలకు, దర్శకత్వానికి పెట్టింది పేరు అయిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ రచింది, నిర్మించి, దర్శకత్వం చేసిన వెబ్ సిరీస్ “దూత”. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటించారు, ప్రియా భవాని శంకర్ కథానాయకి గా చేసారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ , విక్రమ్ కె కుమార్ సంయుక్తంగా నిర్మించారు . ఈ OTT చిత్రం డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. మనం , థాంక్ యూ చిత్రాల తరువాత మళ్ళీ విక్రమ్, చైతన్య కలిసి పనిచేస్తున్నారు . వాళ్ళ ఇదివరకు చిత్రం అయినా థాంక్ యూ అనుకున్నంత విజయం రాబట్టలేకపోయింది. ఈ OTT చిత్రంతో తమ సత్తా చాటుకుని విజయానికి బాట వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరూ . ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం. దూత మొత్తం 8 ఎపిసోడ్ గా విడుదల అయ్యింది. దాదాపుగా ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంది . ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టించే విధంగా ఉండదు ఈ సిరీస్ . 5 భాషల్లో విడుదల చెయ్యటం వలన, ప్రతీ భాషకి సంబందించిన ఒక నటుడు లేక నటి ఉండేలా చూసుకున్నారు దర్శకులు . దూత మొత్తం పాత్రికేయుల గురించి, పాత్రికేయులు పాటించాల్సిన నియమాలు , పద్దతుల గురించి ఉంటుంది . మొత్తం సిరీస్ విశ్లేషణ, నటీ నటుల పెరఫార్మన్స్ , సాంకేతికత గురించి తెలుసుకుందాం .
సాగర్ చంద్ర (నాగ చైతన్య) విశాఖపట్నం లో ఒక పాత్రికేయుడు . తన భార్య ప్రియా) కూడా పాత్రికేయురాలే. కానీ గర్భవతి అవ్వటంవలన వృత్తికి విరామం తీసుకుంటుంది. సాగర్ చంద్ర సమాచారం అనే ఒక కొత్త దినపత్రిక లో చీఫ్ ఎడిటర్ గా కొత్త బాధ్యతని స్వీకరించబోతున్నారు. అది నిజంగా అయితే తన స్నేహితుడు చార్ల్స్ (శ్రీకాంత్ మురళి ) కి దక్కాల్సినది . అనుకోని విధంగా సాగర్ తన కుటుంబంతో సహా ఒక ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రమాదానికి కారణం ఎవరూ అని వెతికే క్రమంలో చాలా సమస్యల్లో ఇరుక్కుంటాడు సాగర్. అనుకోకుండా జరిగిన ఇంకొక క్రైమ్ లో ఇరుక్కుని డిసిపి క్రాంతి షెనాయ్ (పార్వతి) కి చిక్కుతాడు. ఆ క్రైమ్ లో తనతో ఉన్న పోలీస్ ఆఫీసర్ అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్ ) సాగర్ కి సహాయం చేస్తాను అని హామీ ఇస్తాడు . అసల సాగర్ కి , అజయ్ ఘోష్ కి సంబంధం ఏమిటి , క్రాంతి సాగర్ క్రైమ్ కేసు ని ఎందుకు తీసుకుంది? తనకి ఒకప్పటి ప్రజా వాక్కు పార్టీ స్థాపికుడు ,రాజకీయ నాయకుడు చక్రపాణి (రాజా గౌతమ్ ) కి సంబంధం ఏమిటి? అదే పార్టీ నాయకుడు చక్రవర్తి కి సాగర్‌కి సంబంధం ఏమిటి? ఒకప్పటి పోలీస్ అధికారి రమణ ఘోష్ (జీవన్ ) కి ఈ కథకి సంబంధం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవలసి అంశాలు. తన పర్సనల్ అసిస్టెంట్ గా చేసిన అనురాధ కి (ప్రాచి) సాగర్ కి మంధ్య ఏమి జరిగింది. తనవల్ల సాగర్ జీవితంలో తిరిగిన మలుపు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి ఈ సిరీస్ లో.
ఈ చిక్కుముడి బలపడటానికి ఇంకో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు, సత్య మూర్తి గారు, అయన స్నేహితుడు రాజకీయ వేత్త రాఘవయ్య గారు, ఆయన నమ్మిన బంటు ఎడిటర్ భూపతి వర్మ అవధూరి. ఈ ముగ్గురూ ఎవరు అనేది ప్రేక్షకులు చూసి తెలుసుకోవాలి . అసల ఈ కథకి చార్ల్స్ కి సంబంధం ఏమిటి? చనిపోయే ముందు వీళ్ళు ఎందుకు పేపర్ ముక్కలు సేకరిస్తున్నారు, చనిపోయేముందు వాళ్ళకి ఆ సంకేతాలు ఎలా వస్తున్నాయి, సాగర్ వర్మ అవధూరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూసి తెలుసుకోవలసిన విషయాలు. విక్రమ్ గారు అద్భుతంగా రాసుకున్నారు ఈ కథని. ఒక సున్నితమైన క్రైమ్ ఇంకా హార్రర్ కలయికతో ఉన్న కథని ఇంత సున్నితంగా , ప్రతి పాత్రని చూపించాల్సిన పద్దతిలో విశ్లేషిస్తూ తెరకెక్కించిన విధానం మెచ్చుకోతగ్గ విషయం.
చైతన్య తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. మనం ఈ సిరీస్ లో ఎప్పుడు చూడని కొత్త చైతన్య ని చూస్తాం. ప్రతి ఎమోషన్ ని చాలా అద్భుతంగా వ్యక్తపరిచారు అయన. భార్యగా చేసిన ప్రియా గారు కూడా అద్భుతంగా నటించారు. పార్వతి గారి గురించి చెప్పనక్కర్లేదు, క్రాంతి షెనాయ్ పాత్రకి ప్రాణం పోశారు ఆవిడ. ఇంకా కొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన సీనియర్ నటులు, వాళ్ళ పాత్రలకి నూరుశాతం న్యాయం చేసారు. మీకొలాజ్ సైగలా సినిమాటోగ్రఫీ చాల బాగుంది, నవిల్ నూరి ఎడిటింగ్ పని అద్భుతంగా ఉంది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి సన్నివేశాన్ని కట్టిపడేసారు సంగీత దర్శకులు ఇషాన్. ప్రతి షాట్, ప్రతి సన్నివేశం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. తరువాత ఏమవుతుందో అని అందరిని కట్టిపడేస్తుంది దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే . వరుసగా పరాజయాలు పాలు అవుతున్న నాగ చైతన్య కి ఈ సిరీస్ ఒక ఊరటని ఇచ్చేలాగా ఉంది. ఎంతో ఉత్కంఠాన్ని రేకెత్తించే “దూత” సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. తప్పకుండ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.