చిత్రం : సైంధవ్
రేటింగ్ : 2.5 / 5
బాటమ్ లైన్ : “Father : The real unsung hero”
విడుదల తేదీ : జనవరి 13, 2024
నటి నటులు : దగ్గుబాటి వెంకటేష్ , నవాజుద్దీన్ సిద్దిక్వి , ఆర్య , శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా , రుహాణి శర్మ , బేబీ సారా, ముకేశ్ రిషి తదితరులు
డీఓపీ: ఎస్ . మణికందన్
ఎడిటర్: గ్యార్రీ . బిహెచ్
మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
నిర్మాత : వెంకట్ బోయినపల్లి
కథ, కథనం, దర్శకత్వం : డా . శైలేష్ కొలను
ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర ప్రేమికులకు తన చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు మన అందరి వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారు. ఆయన నుంచి వస్తున్న చిత్రం “సైంధవ్”. వెంకటేష్ గారికి ఇది 75 వ చిత్రం అవ్వటం విశేషం. హిట్ (HIT ) అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన దర్శకుడు శైలేష్ కొలను, సైంధవ్ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తనదైన శైలిలో చిత్రీకరించారు. వెంకటేష్ గారు సరసన శ్రద్ధ శ్రీనాధ్ నటించారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రం 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్ గారికి ఎంతో స్పెషల్ అయిన తన 75వ చిత్రం సైంధవ్ ఎలా ఉంది అనే విషయం ఈ రివ్యూలో తెలుసుకుందాం .
కథ : “చంద్రప్రస్థ” అనే ఒక పట్టణంలో సైంధవ్ కోనేరు/సైకో (వెంకటేష్) తన కూతురు గాయత్రీ తో (బేబీ సారా ) కలిసి నివసిస్తూ ఉంటారు. అదే పట్టణంలో మిత్రా (ముకేశ్ రిషి) అనే పారిశ్రామికవేత్త, టెర్రరిస్ట్ ముఠా కి , ఆ ఊరి కుర్రవాళ్ళను సైనికులుగా అమ్మకానికి పెడతాడు. కార్టర్ అనే సిండికేట్ కి మిత్రా నాయకుడు . ఆ సిండికేట్ లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి వికాస. మిత్రా వికాస్ కి ఆ పనిని అప్పచెప్తాడు . కానీ సైకో విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు . అనుకోకుండా గాయత్రీ కి జెన్యు సంబంధిత వ్యాధి వస్తుంది . దానికి సంబందించిన మందు ఖరీదు 17కోట్లు . తన పాపని కాపాడుకునే క్రమంలో సైకో వికాస్ ని ఎలా ఎదురుకున్నాడు? మిత్రా ఎందుకు సైకో విషయంలో జాగ్రత్త అని చెప్పాడు? మిత్రా కి సైకో కి సంబంధం ఏమిటి? మానస్ (ఆర్య) కి సైకో కి సంబంధం ఏమిటి? తన కూతురి సమస్యని సైకో పరిష్కరించాడా? సైకో కి మనోగ్య (శ్రద్ధ ) కి సంబంధం ఏమిటి ? మిత్రా చెయ్యబోయే పనిని సైకో అడ్డుకున్నాడా లేదా అనేది ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
వెంకటేష్ గారిని ఇదివరకు చాలా చిత్రాలలో యాక్షన్ హీరోగా చూసాము . ఆయన కుటుంబ కథ నాయకుడిగా ఒక్కటే కాకుండా విభిన్నమైన చిత్రాలు చేసి అందరినీ మెప్పించగలరు అనేది మళ్ళీ నిరూపించారు దర్శకులు శైలేష్ కొలను. కూతురి సెంటిమెంట్ ని చూపిస్తూనే సైకోలో దాగి ఉన్న క్రూరత్వాన్ని అప్పుడప్పుడు బయటకు తీసి చూపిస్తూనే ఉన్నారు . వెంకటేష్ గారు ఎమోషనల్ సన్నివేశాలలో ఎలాంటి ప్రతిభ కనపరుస్తారో మన అందరికీ తెలిసిందే . మన అంచనాలను ఆయన ఏమాత్రం తగ్గించలేదు అయన విలక్షణ నటనతో . మొదటిసారి తెలుగు చిత్రంలో నటిస్తున్న నవాజుద్దీన్ సిద్దిక్వి గారు అద్భుతంగా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు . ఆయనకి భాష రాకపోయినా నేర్చుకుని నటించిన విధానం ప్రశంసనీయం . మొదటి భాగంకి కొంచం ఎక్కువ సమయం కేటాయించారు . చంద్రప్రస్త అనే ఊరిని సృష్టించి, దానిలో పిల్లలకి సంబంధిత జన్యు పరమైన వ్యాధి గురించి చెబుతూనే ఒక కమర్షియల్ అంశాలని ఎక్కడా కూడా వదలకుండా చూసుకున్నారు దర్శకులు. మొదటి భాగం సమయం ఎక్కువగా ఉండటం వలన కొంచం నెమ్మదిగా వెళుతోంది అనిపించేలా ఉంటుంది అక్కడక్కడా. కథ ముఖ్యమైన అంశాలను, పాప గురించి ఒక తండ్రి పడే తపన, ఇచ్చిన మాట కోసం ప్రాణాలని పణంగా పెట్టే అంశాలు ఎక్కడా కూడా బోరు కొట్టించవు. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. వవెంకటేష్ గారికి తగ్గట్టుగానే అన్నీ సమాపాలంలో పెట్టారు దర్శకులు శైలేష్ కొలను.
నవాజుద్దీన్ కి , వెంకటేష్ గారికి మధ్య ఉన్న సన్నివేశాలు అలరిస్తాయి. ఎక్కడా కూడా అసభ్యకరంగా లేకుండా అన్ని వర్గాలవారు చూడగలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. సైకో క్యారెక్టర్ గురించి అందరూ తలుచుకుంటూ భయపడుతుంటే, ఆ భయాన్ని చూపించిన విధానం కొత్తగా ఉన్నది . ఒక పేరు వింటేనే వణికిపోయేంతలా సైకో ఏం చేసాడు అనేది చిత్రం చూసి తెలుసుకోవాలి. ఆండ్రియా తన వంతు పాత్ర మంచిగా పోషించారు. రుహాణి గారు తన పరిమితిలో మంచిగా ఆకట్టుకున్నారు. శ్రద్ధా గారు తన నటనలో అమ్మతనాన్ని మంచిగా వ్యక్త పరిచారు. మధ్య మధ్యలో ఉన్న కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
నటీనటులు :
సైంధవ్ కోనేరు/ సైకో గా వెంకటేష్ గారు జీవించేసారు . కొన్ని సన్నివేశాలలో ఆయనని చుస్తే మనకే వణుకు వస్తుంది. కళ్ళల్లో ఆ క్రూరత్వం , నటించిన విధానం వర్ణనాతీతం. ఆయన సహజ నటన ఆ పాత్రకి ప్రాణం పోసింది. బేబీ సారా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది . శ్రద్ధ శ్రీనాథ్ గారు మనోగ్య పాత్రలో ఒదిగిపోయారు. మొదటిసారి తెలుగు తెరమీద కనిపించిన ఆండ్రియా , నవాజుద్దీన్ గారు తన విలక్షణ ప్రతినాయకులు పాత్రలను మైమరపించేలా చేసారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు కొన్ని నవ్విస్తాయి కూడా. ఎక్కడా కూడా వాళ్ళు ఇద్దరు, తెలుగు చిత్ర నటులు కాదు అని అనిపించకుండా పాత్రలోకి ఒదిగిపోయి నటించారు. ఆర్య గారు చేసిన ముఖ్య పాత్ర ఆకట్టుకుంటుంది. తన తమిళ చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాకూడా, వరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఆర్య గారు , మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ముకేశ్ రిషి, రుహాణి చేసిన నటన మెచ్చుకోతగ్గవి. ఈ చిత్రానికి ప్రధాన బలం మూడు విషయాలు అని చెప్పొచ్చు . సైకో గా వెంకటేష్ గారు, వికాస్ గా నవాజుద్దీన్ గారు , శైలేష్ రాసుకున్న కథ. ఏ ఒక్క పాత్ర కూడా వృధాగా పెట్టినట్టు అనిపించలేదు. క్లైమాక్స్ చూపించిన విషణం చాలా బాగుంది . కానీ క్లైమాక్స్ అది కాకుండా ఇంకో విధంగా చేసి ఉంటే బాగుండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. చిత్రానికి అదొక్కటే మచ్చలుగా కనిపిస్తోంది. పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొంచం కుటుంబ కథలను ఇష్టపడే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉంది . పాటలు అంతగా ఆకట్టుకోలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకులు చిత్రికరించిన విధానం వివరించలేనిది. అంత అద్భుతంగా చిత్రీకరించారు. మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ చాల చక్కగా ఉంది . ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. చిత్రానికి బలం చేకూర్చింది సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సన్నివేశానికి తగ్గట్టుగా పాటలు ఉన్నాకూడా అవి అంతగా మెప్పించలేదు అనే చెప్పాలి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకున్నారు నిర్మాత . పోరాట సన్నివేశాలు , మాటలు , భావ వ్యక్తీకరణ ఆకట్టుకున్నాయి. పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన విధానం వాటిమీద ఇంకా ఇష్టత చేకూర్చాయి.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి