చిత్రం : గుంటూరు కారం
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్ : “ద్వేషం కన్న, అమ్మ ప్రేమ గొప్పది.”
విడుదల తేదీ : జనవరి 12, 2024
నటీనటులు : మహేష్ బాబు , శ్రీలీల , మీనాక్షి చౌదరి , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , ఈశ్వరీ రావు , మురళి శర్మ , వెన్నెల కిషోర్ , సునీల్ తదితరులు
డీఓపీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ : నవీన్ నూలి
మ్యూజిక్ : థమన్ . ఎస్ .ఎస్
బ్యానర్ : హారిక & హాసిని ఎంటర్టైన్మెంట్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన, దర్శకత్వం : త్రివిక్రం శ్రీనివాస్
చాలా కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికతో చిత్రం రాబోతోంది అంటే సినీ ప్రియులకి పండగే . అందులోను మహేష్ బాబుకి ఎంతో కలిసి వచ్చిన పండగ సంక్రాంతి సమయంలో విడుదల అవుతోంది అంటే అంచనాలకి హద్దే ఉండదు . తారాస్థాయి అంచనాల నడుమ విడుదల అయిన చిత్రమే “గుంటూరు కారం”. అతడు, ఖలేజా తరువాత ముచ్చటగా మూడవసారి ఇద్దరి కలయికతో వచ్చిన ఈ చిత్రం హారిక & హాసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు . మరి సంక్రాంతి బరిలో ఈ చిత్రం ఎలా తలపడిందో ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
వెంకట రమణ (మహేష్ బాబు) చిన్న తనంలోనే తన తల్లి వసుంధర (రమ్య కృష్ణ) నుంచి విడిపోయి తన మేనత్త బుజ్జి (ఈశ్వరీ రావు) దెగ్గర గుంటూరులో పెరుగుతాడు. తన తల్లితో ఎలాంటి మాటలు లేకుండా అడ్డుగా ఉంటాడు వసుంధరా తండ్రి, రాజకీయ చాణిక్యుడు వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్ ). తన భర్త రాయల సత్యం (జయరాం ) ని వదిలేసిన వసుంధర ని , రెండో పెళ్లి చేసి రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా స్వామి నిలబెడతాడు. తన కూతురి రాజకీయ భవిష్యత్తుకి రమణ అడ్డు రాకూడదు అనే చేసే ప్రయత్నమే మిగతా కథ . అసల రమణ తన తల్లి నుంచి ఎందుకు విడిపోయాడు? స్వామి ని రమణ ఎలా ఎదురుకున్నాడు? తన తల్లిని తననుంచి వేరు చెయ్యటానికి జరిగే కుట్ర ఏమిటి ? తన తల్లిని మళ్ళీ కలిశాడా? విడిపోయిన తన తల్లి తండ్రులని కలిపాడా ? రమణ కి మిర్చి యార్డ్ కి సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ .
విశ్లేషణ :
కథ పరంగా చాలా చిన్న అంశంతో మొదలవుతుంది, ఇంక ఆ ఒక్క అంశంచుట్టూనే తిరుగుతూ ఉంటుంది . రమణ పాత్రలో మహేష్ ఎప్పటిలాగానే దుమ్ము లేపారు. అసలు సిసలైన గుంటూరు మిర్చిలానే ఘాటైన నటనా చాతుర్యంతో ప్రేక్షకులని కట్టిపడేసారు . అయన యాస , నడవడిక పక్కా మాస్ గా ఉంది . తల్లి కొడుకు సెంటిమెంట్ ని చాలా వరుకు నిలబెట్టే ప్రయత్నం చేసారు దర్శకులు. రాజకీయ చాణిక్యుడిగా ప్రకాష్ రాజ్ నటన మాటలకూ అందనిది. వెన్నెల కిషోర్ తో ఉండే హాస్య సన్నివేశాలు కొంచం బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. మహేష్ బాబు స్వాగ్ , మాస్ యాక్టింగ్ ఒక్కటే ఆకట్టుకుంటుంది మొత్తం మీద . శ్రీలీల నటన ఉన్నంతలో పరవాలేదు అనిపించింది. మీనాక్షి చౌదరి కి పెద్దగా నటించే అవకాశం కల్పించలేదు అనిపించేలా ఉన్నాయి తన సన్నివేశాలు . చాలా భారీ తారాగణంతో చిత్రీకరించిన గుంటూరు కారం మహేష్ గారు ఉన్న కొన్ని సన్నివేశాలలో చాలా ఉద్రేకపరిచే విధంగా ఉన్నాయి . సినిమా మొత్తాన్ని తన భుజాలమీద మోశారు ఆయన. కొన్ని సన్నివేశాలలో అక్కర్లేదు కామెడీ పెట్టటం ప్రేక్షకులని అసహనానికి గురయ్యేవిధంగా తోచాయి. తల్లి ప్రేమ కోసం తపించే కొడుకు పాత్రలో మహేష్ గారు జీవించారు. తనదైన శైలిలో కథనాన్ని రాసుకున్నారు గురూజీ త్రివిక్రం గారు . మూల కథ అయన రచించకపోవటం వలన ఏమో , గురూజీ లెవెల్ మార్క్ కొంచం తప్పింది అనిపించింది.
నటీనటులు :
మహేష్ బాబు గురించి చెప్పేది ఏముంటుంది. ఎప్పటిలానే పాత్రలో ఒదిగిపోయారు. ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు దున్నేశారు . ఫైట్స్ మధ్యలో ఆయన కామెడీ పండించటానికి చేసిన ప్రయత్నం మెచ్చుకోతగ్గ విషయం. శ్రీలీల గారికి అంతగా నటించే అవకాశం లేకపోయినప్పటికీ ఉన్నంతలో పరవాలేదు అనిపించేసారు. మీనాక్షి గారికి తనకి తగ్గ పాత్ర ఇచ్చి ఉంటే బాగుండేది. ఆవిడ తన పల్లెటూరి క్యారెక్టర్ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసారు . ప్రకాష్ రాజ్ గారు, మహేష్ గారి కలయికతో వచ్చిన ప్రతి చిత్రం ఆకట్టుకునేలానే ఉంటాయి. వాళ్ళ మధ్య నడిచే సన్నివేశాలలో ప్రకాష్ రాజ్ గారి నటన అమోఘం. ఆయనకీ ఉన్న అనుభవం ఆ పాత్రలో కొట్టొచ్చినట్టు కనిపించింది . మురళీ శర్మ గారి కామెడీ టైమింగ్ , వెన్నెల కిషోర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి . రమ్యకృష్ణ గారు ఎప్పటిలానే తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకునేలాగా నటించి అలరించారు. జగపతి బాబు గారు ప్రతినాయకుడిలాగా చెయ్యటానికి చాలా వరుకు ప్రయత్నించారు. నటన పరంగా బాగున్నప్పటికీ పాత్రలో బలం తగ్గింది అనిపించింది.
సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం ఆకట్టుకోలేకపోయింది. చాలా చోట్ల అక్కర్లేదు సన్నివేశాలు ఉన్నాయనే అనిపించేలాగా ఎడిటింగ్ చేసారు చిత్రానికి . సంగీతం పరంగా రెండు పాటలు పర్లేదు అనిపించుకున్నా , బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీ పోరాట సన్నివేశంలో పండలేదు. డాన్స్ పరంగా అభిమానులు చాలా ఖుషీ అయ్యారు. మహేష్ బాబు ని చూపించిన విధానం మెచ్చుకోతగ్గ విషయం. పోరాటాలు కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని అలరించలేకపోయాయి . ప్రేక్షకులు ఎక్కువగా మ్యూజిక్ మీద నమ్మకం పెట్టుకున్నారు, అదే కొంచం నిరాశ పరిచింది అనే చెప్పొచ్చు. ఒక చిన్న కథని, ఇంత పెద్దగా తెరకెక్కించాలి అని చేసిన ప్రయత్నం వరుకు మెచ్చుకోతగ్గ విషయం, కానీ ఉన్న తరగణాన్ని సరైన రీతిలో వాడుకుని ఉండొచ్చు అనిపించింది.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి