చిత్రం : ఈగల్
విడుదల తేదీ : 09.ఫిబ్రవరి , 2024
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్ : ఎవ్వరూ ఊహించని , ఎలాంటి శక్తీ ఢీ కొట్టలేని విస్పోటం “EAGLE”
నటీనటులు : రవితేజ , అనుపమా పరమేశ్వరన్ , కావ్యా థాపర్ , నవదీప్ , మధుబాలా, అజయ్ ఘోష్ , అవసరాల శ్రీనివాస్ , శ్రీనివాస్ రెడ్డి, వినయ్ రాయ్ తదితరులు
ఎడిటర్ : కార్తీక్ ఘట్టమనేని , ఉతురా,
సంగీతం : దావిజన్డ్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని , కామిల్ ప్లోసీకి , కామిల్ చావలా
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
మూవీ బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కథనం, దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
ఒక ఆశయాన్ని బతికించాలి అనుకున్న వాడిని ఏ శక్తీ ఆపలేదు. దాన్ని బతికించటానికి ఎంత దూరం అయినా వెళతాడు . ఈ నానుడి నిజం చేసింది “ఈగల్”. నూతన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, మాస్ రాజా రవితేజ గారి కలయికతో విడుదల అయిన చిత్రం ఈగల్. ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదల అయిన ఈ చిత్రంలో రవితేజ గారికి జంటగా కావ్యా నటించారు , ఒక ముఖ్య పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించారు. సంక్రాంతికి విడుదల అవ్వాల్సింది ఈ చిత్రం కొన్ని అనుకోని కారణాల వలన ఈ రోజు విడుదల అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా టి.జి. విశ్వ ప్రసాద్ గారు , వివేక్ కూచిభొట్ల గారు నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యింది . ఎంతో కాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ గారికి ఈ ఈగల్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, అసలు ఈగల్ ఎలా ఉంది, మిగిలిన వివరాలని ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ: 18 ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్స్, ఎన్నో ప్రపంచ దేశాలు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఎస్సాస్సిన్ “ఈగల్” సహదేవ్ వర్మ (రవి తేజ). తనని ముట్టుకోవటం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. తనతో ఎల్లప్పుడూ ఉండేది ఒక్క జై (నవదీప్) మాత్రమే. జై మాత్రమే తనకి ఉన్న ఒకేఒక్క అనుచరుడు. ఢిల్లీ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న నళిని (అనుపమ) కి ఒక వస్త్ర దుకాణంలో ఒక అరుదైన కాటన్ చీర కనిపిస్తుంది. ఆ చీర యూరోప్ దేశం నుంచి వచ్చినప్పటికీ అది నేయటానికి కారణం అయిన స్థలం తలకోన అడవుల్లో కొండమీద ఉండే ఒక ప్రదేశం. ఆ ప్రదేశం గురించి తను ప్రచురించిన ఆర్టికల్ వలన చాలా సమస్యలు ఏర్పడి తన ఉద్యోగం పోతుంది. ఒక ప్రదేశం గురించి రాసిన ఆర్టికల్ వలన తన ఉద్యోగం పోవటానికి కారణం వెతుక్కుంటూ వెళ్లిన తనకి సహదేవ్ గురించి తెలుసుకోవటంతో మొదలవుతుంది దేశం దాచేసిన ఒక నిజాన్ని బయటకి తీసే ప్రయత్నం. అసలు సహదేవ్ గురించి ఎందుకు అందరూ వెతుకుతున్నారు? యూరోప్ లో ఉండే ఈగల్ సహదేవ్ కి ఈ చిన్న పల్లెటూరికి సంబంధం ఏమిటి? డబ్బుకోసం ప్రాణాలు తీసే అతన్ని ఒక ఊరు మొత్తం దేవుడిలా ఎందుకు కొలుస్తుంది? అసలు అంతలా దాచటానికి ఆ ప్రదేశంలో ఏమి జరిగింది ? ఇలాంటి ప్రశ్నలకి జవాబులు దొరకలాంటే, ఈగల్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రతీ మనిషికీ అందరికీ చెప్పుకోలేని ఒక చీకటి జీవితం ఉంటుంది. అది అంత గొప్పది కాకపోవచ్చు. కానీ ఒక సందర్భం కచ్చితంగా వస్తుంది, ఒక అద్భుతం చెయ్యటానికి. మంచి చెయ్యటానికి బలమైన కారణం, సంకల్పం ఉంటే చాలు అని నిరూపించిన పాత్ర సహదేవ్. కొంత నెమ్మదిగా మొదలయినప్పటికీ కథలోకి తీసుకువెళ్లే విధానం కొత్తగా ఉంటుంది. దర్శకుడు ఇదివరకు చెప్పినట్టుగానే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. కథని చెప్పే క్రమంలో భాగంగా, ముందుకీ, వెనక్కీ వెళుతూ ఉంటుంది. అలాంటి విభిన్నమైన స్క్రీన్ ప్లే నూతన దర్శకుడు చెయ్యటం, చాలా గొప్ప విషయం. పాత్రలు కథ చెబుతున్నాయని అనుకుంటాం, కానీ స్క్రీన్ ప్లే కథ చాలా అద్భుతంగా చూపిస్తుంది మనకు. ఏంతో కాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న రవి తేజ గారు, కొంచం విభిన్నమైన కథా కథనంతో మన ముందుకు వచ్చారు. మంచి ఎమోషనల్ గా, మనుసుకి హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకులు. ఇంత యాక్షన్ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలని చూపించి, మెప్పించటం అంటే మాటలు కాదు.
మొదటి భాగం: కథలోకి వెళ్ళాలి కాబట్టి, కొంచెం ఆచి తూచి నెమ్మదిగా తీసుకు వెళుతున్నట్టు ఉంటుంది. అనుపమా గారి ఇన్వెస్టిగేషన్, ఆ తలకోన ప్రదేశం గురించి మాట్లాడితేనే అందరూ భయపడటం, ఎవ్వరూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం కొంత ఆత్రుతని రేకెత్తిస్తాయి. మొదటి భాగంలోనే సహదేవ్ పాత్రని చాలా కోణాలలో, విభిన్నమైన వేషధారణలో చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు. ఎక్కడా కూడా అసలైన కారణం దొరకదు. ఆ ప్రదేశం గురించి రాసినందుకు తన ఉద్యోగం పోవటం, నళిని పంతంతో అన్నీ విషయాలని సేకరించటం, ఆ ఊరి మంత్రి సోమేశ్వర రెడ్డి (అజయ్ ఘోష్) సహదేవ్ పేరు వింటేనే వణికిపోవడం కొంత ఉత్సుకతని సృష్టితాయి. అసలు చనిపోయాడు అనుకున్న ఈగల్ బతికే ఉన్నడేమో అనే అనుమానం RAW చీఫ్ గాయత్రీ దేవి (మనోబాల) గారికి వస్తుంది. దానికి కారణం ఈగల్ మాత్రమే ఉపయోగించే kustavo black arrow bullet పోలాండ్ లో దొరకటం. ఇలాంటి ఇంటరెస్టింగ్ అంశాలతో మొదటి భాగం ముగుస్తుంది.
రెండొవ భాగం: భారత దేశం మాత్రమే కాదు, తనకోసం ఎన్నో ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయని తెలిసినప్పటికీ సహదేవ్ ఆ ఊరిలో ఉండటానికి కారణం నెమ్మదిగా తెలియచేసే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో రచన (కావ్యా) తో పరిచయం ఏర్పడటం, సహదేవ్ జీవితంలో మార్పు మొదలవ్వటం చూపిస్తారు. ఈ భాగం మొత్తం యాక్షన్ అంశాలు అదిరిపోయేలా ఉంటాయి. అమ్మవారి బలి సన్నివేశానికి పూనకాలు వస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో కొన్ని ఊహించని అంశాలని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసారు, అదే అడవిలో ఉండే నక్సల్స్ కి, దేశాన్ని నాశనం చేసే తీవ్రవాదులకు ఉండే చీకటి సంబంధాల గురించి. సహదేవ్ కి ఉన్న అసలైన కారణం, తను చేసిన త్యాగం, తీసుకున్న నిర్ణయం, దానివల్ల దారితీసిన అంశాలని చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
నటీనటుల పెర్ఫార్మన్స్:
ఈగల్ గా , సహదేవ్ గా రవితేజ గారి నటన అమోఘం. తన నట విశ్వరూపాన్ని చూస్తారు తెరమీద. మొత్తం చిత్రంలో తన పాత్రని చూపించిన విధానానికి దర్శకుడికి అభిమానులం అవుతామేమో. నళిని పాత్రలో అనుపమా ఒక మొండి పిల్లగా నటించి మెప్పించారు. కొంత గ్యాప్ తరువాత తెరమీద కనిపించి, ఆవిడ అభిమానులకి మంచి నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో కనిపించి ఆనందపరిచారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది నవదీప్ పాత్ర. ఎల్లప్పుడూ సహదేవ్ తోనే ఉంది, ఒక నీడలాగా కనిపించే పాత్ర. ఇలాంటి పాత్ర ఒప్పుకున్నందుకు నవదీప్ గారిని మెచ్చుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి , అజయ్ ఘోష్ గారి పాత్రలు నవ్విస్తాయి. కథలో వాళ్ళు కూడా ముఖ్య భూమిక పోషించారు. కావ్య, తను ఉన్న కొద్ధి పాటి సమయంలో అలరించారు. అవసరాల శ్రీనివాస్ RAW ఏజెంట్ గా, మనోబాల గారు RAW చీఫ్ గా తమ నటనతో అలరిస్తారు. మిగతా చిన్న చిన్న పాత్రలు చేసిన అందరూ, వాళ్ళకి ఉన్న పరిధిలో మంచిగా నటించారు. వినయ్ రాయ్ పాత్ర కూడా కథలో ముఖ్యంసంతో ముడిపడి ఉంటుంది. ఆయన చెయ్యాల్సిన న్యాయం చేసారు ఆ పాత్రకి. చిన్న చిన్న డాన్ పాత్రలు చేసిన వాళ్ళు కూడా తమ వంతు సహాయం చేసారు.
సాంకేతిక వివరాలు:
ముఖ్యంగా మెచ్చుకోవలసింది సంగీత దర్శకుడిని. దావిజన్డ్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ చిత్రాన్ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. ప్రతీ సన్నివేశంలో ఆయన పనితనానికి 100 శాతం మార్కులు ఇచ్చేయ్యాల్సిందే. పోరాట సన్నివేశాల చిత్రీకరణ అద్భుతం అనే చెప్పాలి. మాటలు సరిపోవు, అంత అద్భుతంగా ఉన్నాయి. అభిమానులు ఈలలు వేస్తున్నారు చూసేటప్పుడు. డ్రోన్ ఉపయోగించిన బృందాన్ని ప్రశంసించాలి. ఎక్కడా కూడా నిర్మాణ విలువలు తగ్గలేదు. చూపించాల్సిన కథని పూర్తి స్థాయిలో చూపించారు. దర్శకుడు తన మొదటి ప్రయత్నంతోనే అందరి మెప్పుని పొందారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. జీవితానికి సంబందించిన అంశాలని చెప్పే క్రమంలో వాడిన మాటలు తూటాలలాగా పేలతాయి. రవితేజ గారి ఎలివేషన్ సంభాషలు చూసినప్పుడు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. మేకప్, సెట్ వేసిన విధానం, పాత్రల ప్రాముఖ్యత, విదేశాలలో చిత్రికరించిన లొకేషన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు రవి తేజా గారి నట విశ్వరూపాన్ని బయటకి తీశారు ఈ పాత్రతో. ఆయన ప్రతిభని కచ్చితంగా మెచ్చుకోవాలి. రవితేజా గారిని అభిమానులు ఎన్నాళ్లగానో ఎలా చూడాలని అనుకుంటున్నారో నూతన దర్శకుడు కార్తీక్ అలా చూపించారు. మొత్తానికి ఈ చిత్రం ఒక విస్పోటం. ఆ చిత్రానికి సంబందించిన ఒక ముఖ్య అంశం మన అందరి హృదయాలలోకి చొచ్చుకుని వెళ్లి ఆలోచింప చెయ్యటం తధ్యం. చివరిలో వచ్చే ఒక ఇంటరెస్టింగ్ అంశం చూసే తెలుసుకోవాలి మరి.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి