చిత్రం: భామాకలాపం 2
రేటింగ్ : 2.75/5
స్ట్రీమింగ్: ఆహా (ఫిబ్రవరి 16 నుంచి)
బాటమ్ లైన్: కుటుంబంకోసం ఎంతకైనా తెగించే భామ మన “అనుపమ”
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, అనూజ్ గుర్వారా, సుదీప్ వేద్, చైతూ జొన్నలగడ్డ, రుద్ర ప్రతాప్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రాఫర్: దీపక్ యారగెరా
నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర
కథ, స్క్రీన్‍ప్లే, దర్శకత్వం: అభిమన్య తాడిమేటి
రెండు సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా ఆహా లో విడుదల అయిన చిత్రం “భామాకలాపం”. పియమణి, శరణ్య ముఖ్య పాత్రలుగా వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఒక విలువైన గుడ్డు చుట్టూ తిరిగే క్రైమ్ కథ ఈ చిత్రం. కానీ నవ్వించటంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా చిత్రీకరించారు దర్శకులు అభిమన్యు. ఇప్పుడు అదే భామాకలాపం కి కొనసాగింపు విడుదల అయ్యింది ఆహా లోనే. ఇది కూడా క్రైమ్ కి సంబంధించిందే అనే విషయం ట్రైలర్ చూడగానే తెలిసిపోతోంది. రెండు సంవత్సరాల తరువాత విడుదల అయిన రెండొవ భాగం ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ:
తమ జీవితంలో జరిగిన ఘటనల వలన, అనుపమ (ప్రియమణి), మోహన్ (రుద్రప్రతాప్) తమ ఇంటిని అమ్మేసి వేరే ఇంటికి వెళతారు. అనుపమ యూట్యూబ్ లో ఫేమస్ అవ్వటం వలన ఒక హోటల్ మొదలు పెడుతుంది తన పాత పనిమనిషి అయిన శిల్ప(శరణ్య) తో కలిసి. తను ఒక వంటల పోటీకి సెలెక్ట్ అవుతుంది. అది నిర్వహించే సంస్థ లోబో హోటల్స్ యజమాని ఆంటోనీ లోబో (అనుజ్ గుర్వరా) తన పార్టనర్ అయిన జుబేదా (సీరత్ కపూర్) తో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతనిని పట్టుకోవాలని, ఇండియా లో ఉన్న మత్తు పదార్ధాల మాపక సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థకి చెందిన ఒక అవినీతి ఆఫీసర్ సదానంద్ (రఘు ముఖర్జీ) దగ్గరకి అనుపమ, శిల్ప వెళ్లాల్సివస్తుంది. అక్కడనుంచి అసలు కథ మొదలవుతుంది. కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, పోటీలో గెలవాలని అనే రెండు లక్షాలతో అనుపమ ఏమేమి చేసింది?. సదానంద్ దెగ్గరికి ఎందుకు వెళ్లారు? ఆయన వలన వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఆయన చెయ్యమన్న పనేమిటి? అసలు బంగారపు కోడి పుంజు ట్రోఫీ కి ఈ గొడవకి సంబంధం ఏమిటి ? ఇలాంటి విషయాలకి సమాధానం తెలుసుకోవాలంటే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న భామాకలాపం 2 చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్రానికి ముఖ్య భుజాలు ప్రియమణి, శరణ్య గారు. వీళ్ళు చేసిన కామెడీ, సీరియస్ సిట్యువేషన్ లో నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రియమణి గారికి ఎందుకు నేషనల్ అవార్డు వచ్చిందో, ఈ చిత్రంలో ఆవిడ నటన చుస్తే మనకి తెలిసిపోతుంది. కుటుంబాన్ని కాపాడుకునే తపన ఉన్న ఒక స్త్రీ గా, సామాజిక బాధ్యత కలిగిన మనిషిగా చాలా బాగా చేసారు ఆవిడ. శరణ్య గారి కామెడీ టైమింగ్, డైలాగ్ చెప్పే విధానం చాలా ఆకట్టుకుంటాయి. రఘు ముఖర్జీ కూడా తన వంతు పాత్ర బాగా పోషించారు. కుడి చెయ్యి కోల్పోయిన ఆయన ఆర్టిఫిషల్ చెయ్యితో తలెత్తిన సమస్యలు, ఉద్యోగంలో అవమానాలు, ఇంటిలో సమస్యలు ఇవన్నీ భరిస్తూ ఆయన పోషించిన ఒక ప్రతినాయకుడి పాత్ర మెచ్చుకోతగ్గ విషయం. మొదటినుంచీ ఒక్కో సన్నివేశానికి కావలసిన కనెక్టింగ్ పాయింట్ ని దర్శకులు మంచిగా రాసుకున్నారు. ఒక పాత్ర ఇంకో పాత్రని కలిసే విధానం కూడా కనెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా మంచిగా రాసుకున్నారు దర్శకులు. మొదటినుంచి మంచిగా రాసుకున్న స్క్రీన్ ప్లే, చివరి 30 మినుషాలు కొంచం సడిలింది అనిపించేలా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. దొంగతనం సన్నివేశాలు, చివర్లో వచ్చే గన్ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ అంతగా ఆకట్టుకునేలా తియ్యలేదు అనిపిస్తాయి. సీరత్ కపూర్ కి మంచి గ్లామర్ పాత్రనే ఇచ్చారు. ఆవిడ చేసిన పాత్రకూడా కథకి చాలా ముఖ్యమయినది.
సాంకేతిక వివరణ:
కథ పరంగా చాలా గొప్పగా రాసుకున్నారు అభిమన్యు. కథ మంచిగా రాసుకున్నప్పటికీ ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కొంచం గాడి తప్పింది అనిపించేలా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. ఆఖరున వచ్చే పోరాట సన్నివేశాలు, దొంగతనం సన్నివేశాలు తేలిపోయాయి అని అనిపించే విధంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఇచ్చారు సంగీత దర్శకులు, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అందించిన దీపక్ పని తనం కూడా బాగుంది. ప్రతీ సన్నివేశాన్ని, ప్రతీ పాత్రని ఇంకో పాత్రకి లింక్ చెయ్యటం బాగుంది.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి