ప్రేమ చాలా మధురమైనది, ప్రత్యేకమైనది, మాటలకు అందనిది, వర్ణించలేని భావన. వయసుకి సంబంధంలేని ఒక నిర్మలమైన, స్వచ్ఛమైన అనుభూతి. ప్రతీ జీవికీ తోడు చాలా ముఖ్యం, ప్రతీ జీవుడికీ ఆ హక్కు ఉన్నది. ప్రేమని పొందటానికి, ప్రేమించిన మనిషికి కొంచం సమయం కూడా దూరంగా ఉండకుండా ఎల్లప్పుడూ దెగ్గరగా ఉండటం అనేది ఒక వరం. మనకి ఎంతో ముఖ్యమైన రోజున మన ప్రాణంతో సమానమైన వాళ్ళు మన దగ్గర లేకపోతే, ఆ విరహవేదన తల్లి ఆవునుంచి దూడని వేరుచేసినంత బాధ కలిగిస్తుంది. అలాంటి మనసుకి హత్తుకునే ఒక ప్రేమ సాగరాన్ని, తన పదాలతో, గానంతో, అభినయంతో వ్యక్తపరిచే ప్రయత్నం చేసారు సుపరిచిత గాయని సునీత గారు. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఒక చిన్న సన్నివేశాన్ని, ఎంతో మధురానుభూతిని ఇచ్చే విధంగా, ప్రతీ ప్రేమ పిపాసి తన భావోద్వేగానికి హృదయ పొరల్లోంచి స్పందించే విధంగా ఒక ప్రేమ గీతాన్ని విడుదల చేసారు అదే “ఎంత ప్రేమ” పాట. ఒక ప్రేయసి, తన ప్రాణం కన్నా ఎక్కువ అయిన తన భాగస్వామిని తలుచుకుంటూ, అతనిని కలుసుకునే క్రమంలో చేసిన అద్భుతమైన ప్రయాణం, ప్రకృతి వాళ్ళని కలపటానికి చేసిన తాపత్రయం, తన హృదయ స్పందనని తన ప్రియుడికి చేరవెయ్యటానికి చేసిన ప్రయత్నం మధురం. సునీత గారు, అచ్చు గారు కలిసి నటించి గానం చేసిన ఈ ప్రేమ కావ్యాన్ని కృష్ణ కాంత్ గారు రచించారు, అచ్చు గారు సంగీతం అందించగా మాంగో మ్యూజిక్ వాళ్ళు నిర్మించారు. ప్రకృతిని, ప్రేమని కలిపి ఒక అందమైన పర్వతాల నడుమ, ఎంతో పవిత్రమైన తన ప్రేమని మనసులో అనుభవిస్తూ, దైవంతో సమానమైన తన భాగస్వామి కోసం పరితపించే ఒక మహిళగా (ప్రకృతి) గా సునీత గారు కనిపించారు, అచ్చు గారు చివర్లో తళుక్కుమంటూ మెరిశారు. కృష్ణ కాంత్ గారు ఇచ్చిన సాహిత్యం అందరినీ కదిలించే విధంగా ఉన్నాయి, అచ్చు గారి సంగీతం కూడా బాగున్నది. చిత్రీకరణ అంతా తమిళనాడు ప్రాంతంలో చేసారు, ప్రేమని పవిత్రమైన ప్రకృతితో పోల్చి చూపించిన విధానం అద్భుతం. DOP విశ్వా గారి పనితనం చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో ఆల్బమ్ కి డైరెక్టర్ గా సునీత గారు బాధ్యతలు చేపట్టారు. ప్రేమికుల రోజుని పురస్కరించుని ఫిబ్రవరి 14న విడుదల అయిన ఈ పాట, ఇప్పుడు యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.