ఎన్నో ఏళ్లుగా తనదైన శైలిలో చిత్రాలని తీస్తూ అందరినీ అలరిస్తూ వస్తున్న దర్శకుడు శంకర్. స్వతహాగా తమిళ చిత్రసీమకు చెందిన ఈయన చిత్రాలంటే, తమిళ నాటకన్నా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తారు. అలాంటి శంకర్ మొదటిసారి డైరెక్ట్ తెలుగు చిత్రం చేస్తున్నారు, అదికూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో. గతేడాది ఈ చిత్రానికి “గేమ్ చేంజర్” అని నామకరణం చేసారు కూడాను. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నారు, థమన్ సంగీతం అందిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా చిత్రీకరణ జరుగుపుకుంటున్న ఈ చిత్రం సంబందించిన అప్డేట్ గతేడాది వచ్చింది. ఫస్ట్ సింగల్ రూపంలో “జరగండి” అనే పాటని విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. కానీ అది విడుదల అవ్వలేదు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబందించిన ఒక్క అప్డేట్ కూడా బృందం నుంచి వెలువడలేదు. ఇటీవల వైజాగ్ లో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని గతేడాది రావాల్సిన పాటని ఈరోజు విడుదల చేసారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటని, థమన్ సంగీతం అందించగా, పంజాబీ ప్రఖ్యాత గాయకుడు దలేర్ మెహెన్ది, సునిధి చౌహన్ ఆలపించారు. లిరికల్ వీడియో విడుదల చేసిన బృందం మొత్తానికి అప్డేట్ అయితే ఇచ్చారు అని ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక ప్రేమ గీతం. కొంచం మాస్, కొంచం క్లాస్ టచ్ ఉన్నది ఈ పాటలో. శంకర్ చిత్రం అంటేనే గుర్తొచ్చేది గ్రాఫిక్స్. పాట వీడియోలో అందరినీ అలరించేది కూడా ఆ రోడ్ గ్రాఫిక్స్. పోస్టర్లో రామ్ చరణ్ చేతిలో ప్రేమలేఖలు అనే పేరుగల పుస్తకం కూడా ఉంది. రామ్ చరణ్ మేకప్, డ్రెస్ కొత్తగా ఉన్నాయి. పల్లెటూరి పిల్ల గెటప్ లో కియారా కూడా ముద్దుగా ఉన్నారు. ఒకచోట రామ్ చరణ్ డ్రెస్ మీద కియారా చిత్రం ముద్రించి ఉంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం చాలా ఉన్నది. కొంచం అపరిచితుడులో “కొండకాకి” పాట, “ఐ మనోహరుడు” లోని “ఐలా” పాట సెట్ కలగలిపిన గ్రాఫిక్స్ లాగా కనిపిస్తుంది. గతేడాది ఈ పాట కొంత లీక్ అయ్యింది, ఫాన్స్ కొందరు రియాక్ట్ కూడా అయ్యారు అంతగా బాలేదు అని. అది డ్రాఫ్ట్ వెర్షన్ కాబట్టి నచ్చకపోవచ్చు, ఈరోజు విడుదల అయిన ఫైనల్ వెర్షన్ నచ్చుతుందనే చిత్ర బృందం కూడా ఆశిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తో మంచి విజయం అందుకున్న చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని ఆశిద్దాం.