సినిమా అనేది దాని గురించి తెలియని వాళ్ళకి అదొక రంగుల ప్రపంచం. అబద్దాలతో నడుస్తుంది. కానీ కొన్ని వందల మందికి అన్నం పుట్టే ప్రాణ వాయువు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మందికి ఆనందాన్ని, వినోదాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే మాధ్యమం. అలాంటి సినిమా వ్యవస్థలో ఎప్పటినుంచో మంచి పునాది ఉన్న తెలుగు ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకాన్ని ఎగరవేస్తోంది. ప్రపంచ సినీ ప్రియులని మన వంక చూసే విధంగా కొన్ని చిత్రాలు విడుదల అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాయి. అందులో మొదటిది రాజమౌళి, ప్రభాస్ కలయికతో వచ్చిన బాహుబలి రెండు అధ్యయాలు. అక్కడనుంచి మొదలయ్యింది మన కీర్తి పతాకం ఎగరటం. ఆ పతాకాన్ని తరువాత చాలా మంది నటులు అలానే రెపరెపలాడుతూ ఎగిరేలా చేసారు కూడాను. మన తెలుగు నటులు ఇతర భాషల దర్శకులతో పనిచేయటం, వాళ్ళు వచ్చి మన సినిమాలలో ముఖ్య పాత్ర పోషించటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్, నాగ అశ్విన్ చిత్రం అయిన కల్కి 2898 AD మీద అందరి కళ్ళు పడ్డాయి. ప్లాన్ చేసిన విధంగా అయితే ఈ చిత్రం మే 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వలన వాయిదా పడింది, ఇప్పుడు కొత్త తారీఖు కోసం వెతుకులాట మొదలయ్యింది. కాకపోతే మే నెల చివరి వారంలో విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నట్టు అయితే వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ RRR తరువాత ఎలాంటి చిత్రం విడుదల చెయ్యలేదు. తనకి జనతా గ్యారేజ్ చిత్రంతో గుర్తిండిపోయే విజయాన్ని ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తో దేవర అనే చిత్రం చేస్తున్నారు. లెక్క ప్రకారం ఇది ఇప్పటికే విడుదల అవ్వాలి. ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మొదటినుంచి చెప్పిన బృందం అమాంతం 6 నెలలు వాయిదా వేసి చివరికి అక్టోబర్ 10 న విడుదలకి రంగం సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉంటే, తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలు తీసే దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన చిత్రం పుష్ప. ఈ చిత్రానికి మొదటి భాగం పుష్ప ది రైజ్ రెండు సంవత్సరాల క్రితం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. పెద్ద పెద్ద నటులు , వ్యాపార వేత్తలు ఈ చిత్రంలోని కొన్ని డాన్స్ స్టెప్స్ తో ఇంస్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోస్ చేసారు కూడాను. అలాంటి చిత్రం తదుపరి భాగం పుష్ప ది రూల్ ఈ సంవత్సరం ఆగష్టు 15న విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికే glimpse కి మంచి స్పందన వచ్చింది టీజర్ ఏప్రిల్ 8న విడుదల అవ్వబోతోంది. పోస్టర్స్ కి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. తమిళ నాట మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు శంకర్. తనదైన శైలిలో భారీ చిత్రాలు తీసే దర్శకుడు ఈయన. ఎన్నో సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు చిత్రానికి ఇప్పుడు కొనసాగింపు చిత్రీకరించారు. ఇండియన్ 2 అని నామకరణం చేసారు కూడాను. కానీ ఎప్పటినుంచో షూటింగ్ చేస్తున్నప్పటికీ విడుదలకి సిద్ధం కాలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 14 లేదా 15 తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆయన ఆ చిత్రంతో పాటుగా రామ్ చరణ్ తో రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన గేమ్ ఛేంజర్ దసరా ని పురస్కరించుకుని విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇది వచ్చే సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ OG విడుదల ఉంది. దాని మీద పవన్ ఫాన్స్ ప్రాణాలే పెట్టేసుకున్నారు. సాహో తరువాత సుజిత్ తెస్తున్న ఈ చిత్రం గ్యాంగ్ వార్స్ మీద ఉండబోతోంది. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
మొత్తానికి భారత దేశం గర్వించే ఎన్నో చిత్రాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మన తెలుగు నటుల నుంచి రావటం మన అందరికీ గర్వకారణం. తెలుగు అని మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూసే చిత్రాలు అన్నీ మన దక్షిణ సినిమా ఇండస్ట్రీ నుంచి రావటం ఒక చారిత్రాత్మిక ఘట్టం. మొత్తానికి ఈ ఏడు కల్కి, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, పుష్ప ది రూల్, దేవర, చిత్రాలతో మన భారతదేశపు కీర్తి అచంచలంగా వెలగబోతోంది. ఇది తధ్యం.