హీరో నవీన్ చంద్ర ప్రతిభ మన అందరికీ తెలిసిందే. తన నటనా నైపుణ్యంతో పలు చిత్రసీమల్లో నటించిన అనుభవం కూడా ఉన్నది. తెలుగు లోనే కాకుండా తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరో ఆయన. ఇప్పుడు ఆయన హీరోగా అమెజాన్ ప్రైమ్ లో ఒక హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదల అయ్యింది. అదే “ఇన్స్పెక్టర్ రిషి”. టైటిల్ పాత్రలో నవీన్ చంద్ర ఇన్స్పెక్టర్ గా నటించారు. ఆయన సరసన సునైనా గారు హీరోయిన్ గా చేసారు. శ్రీకృష్ణ దయాల్, కన్నా రవి, కుమారవేల్ ముఖ్య పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సిరీస్ ట్రేండింగ్ లో నడుస్తోంది. జె. ఎస్ . నందిని ఈ సిరీస్ రూపకర్త, దర్శకురాలు. సుఖదేవ్ లహరి గారితో కలిసి నందిని గారు నిర్మాతగా వ్యవహరించారు. అశ్వత్ సంగీతం అందించారు. మేక్ బిలీవ్ సంస్థ నిర్మించింది. స్వతహాగా ఇది తమిళ సిరీస్. దక్షిణాది భాషల్లో విడుదల అయ్యింది. ఈ మొదటి సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ హార్రర్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
తేనెకాడ్ అనే మారుమూల పల్లెటూరిలో అనుమానాస్పద రీతిలో చాలా హత్యలు జరుగుతా ఉంటాయి. ఈ హత్యలు జరిగిన చోటు పరిశీలించాక, చాలా అనుమానాలు రేకెత్తుతాయి. ప్రభుత్వం నిర్వహించాలన్న ఏ ఒక్క పథకం కూడా ఆ ఊరిలోకి చేరదు. ఆ ఇన్వెస్టిగేషన్ చెయ్యటానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గా రిషి నందన్ (నవీన్ చంద్ర) ని నియమిస్తారు. అయ్యన్నార్) (కన్నా రవి), చిత్ర (మాలిని) తనకి సహాయక బృందం ఇన్సపెక్టర్స్ గా వ్యవహరిస్తారు. ఈ హత్యలు ఆ ఊరి వనదేవత అయిన వనరాచి చేస్తోంది అని ఊరిలో ఒక అపోహ మొదలవుతుంది. కానీ రిషి మాత్రం ఇది ఒక గుంపు చేస్తోంది అని గట్టిగా నమ్మేవాడు. కానీ తనకి నిరూపించటానికి ఆధారాలు లేవు. ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో అడవిలో జంతువుల అవయవాలతో స్మగ్గ్లింగ్ చేసే ముఠాతో గొడవ ఏర్పడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో తనకి పూర్తి అండగా నిలిచింది ఆ అడవి రేంజర్ సత్య (శ్రీకృష్ణ దయాల్), ఇర్ఫాన్ (కుమారవేల్), ఖ్యాతి (సునైన). ఇన్వెస్టిగేషన్ సమయంలో ఖ్యాతి కి రిషి గురించి ఒక నిజం తెలిసి తనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో రిషికి తన గతం వెంటాడుతూ ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య, రిషి ఈ కేసు ని ఎలా పూర్తి చేసాడు అనేది మిగిలిన కథ. ఈ హత్యలు అందరూ నమ్మేట్టుగా వనరాచ్చి చేసిందా? ఆవిడ దేవత పేరుతో ఎవరన్నా చేస్తున్నారా? అసల చనిపోయిన వాళ్ళకి ఏం జరిగింది? రిషికి ఉన్న గతం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒక హర్రర్ థ్రిల్లర్ తెరకెక్కించటం అంటే కత్తి మీద సాము లాంటిది. ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ చేసినా ఎవ్వరికీ ఎక్కదు. అందులోను దయ్యాలు, దేవతలు లాంటి అంశాలు పెట్టినప్పుడు చాలా మెళకువలతో రాయాలి. ఆ విషయంలో నందిని గారు నూరు శాతం మార్కులు కొట్టేసారు. ఎక్కడా కూడా కథ పక్కకి పోకుండా ప్రతీ పాత్రకి ఒక ప్రాముఖ్యత చూపిస్తూ, కథలో ఉన్న అన్ని పాత్రలకి ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ పెడుతూ ఆధ్యంతం ఆకట్టుకున్నారు. ఆవిడే రాసుకుని దర్శకత్వం చెయ్యటం వలన, ఇంకా ఎక్కువ శ్రద్ధతో, మంచి విశ్లేషణతో ప్రెసెంట్ చేసారు. అశ్యత్ ఇచ్చిన సంగీతం ఇంకా ఎక్కువగా కథలోకి తీసుకువెళుతుంది, భయం కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సమాజంలో ఎవ్వరూ కూడా బయటకి చెప్పుకోలేని కొన్ని అంశాలని ఈ సిరీస్ లో ప్రస్తావించారు. అలాంటి సున్నితమైన అంశాలని ఒక లేడీ డైరెక్టర్ డేరింగ్ గా తెరకెక్కించటం ప్రశంసనీయం. స్క్రీన్ ప్లే కూడా చాలా క్లారిటీ గా ఉంది. భార్గవ్ శ్రీధర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ముఖ్యంగా వనరాచ్చి పాత్రని చీకటిలో భయంకరంగా చూపించటం, శవాలని చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. పాత్రలకి మధ్యలో సృష్టించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్:
రిషి నందన్ గా నవీన్ చంద్ర నటన ప్రశంసనీయం. ఈ కథ ప్రకారం ఆయనకి ఒక లోపం పెట్టారు. ఆ లోపం చూపించిన విధానం కూడా బాగుంటుంది. ఆ లోపంతో ఉన్న వ్యక్తులు ఎదురుకునే సమస్యలు, ఆయన దానిని అధిగమించిన విధానం, దానికోసం ఆయన చేసిన నటన అందరికీ నచ్చుతుంది. సునైనా గారు చాలా పొందికగా నటించారు. ఆవిడ ఒక ఫారెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో మెరిశారు. కథకి తగ్గట్టుగా ఆవిడది చాలా ముఖ్యమైన పాత్ర. శ్రీకృష్ణ దయ, మాలిని, కన్నా రవి, కుమారవేల్, హరిణి, దీప్తి అందరూ వాళ్ళకి తగ్గట్టుగా మంచి ప్రదర్శన చేసారు. రిషి, ఖ్యాతి పాత్రలకి ఉన్నత ప్రాముఖ్యత మిగిలిన వాళ్ళ అందరికీ ఉన్నది. నమ్మకాలని, నిజాలకి మధ్య జరిగే కథని అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు.
బాటమ్ లైన్: కచ్చితంగా కుటుంబం మొత్తం కూర్చుని చూడదగ్గ సిరీస్.