చిత్రం: మార్కెట్ మహాలక్ష్మీ
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: “మార్కెట్ లోకి కొత్త ప్రేమకథ”.
తారాగణం: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మెహబూబ్ బాషా, ముక్కు అవినాష్ తదితరులు.
సంగీతం: జో ఎన్మవ్
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
సినిమాటోగ్రాఫర్: సురేంద్ర చిలుముల
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
బ్యానర్: బి2పి స్టూడియోస్
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
విడుదల: 19 ఏప్రిల్ 2024
ప్రేమకథలకు ఎప్పుడు ఒక క్రేజ్ ఉంటుంది. మనం ఎన్ని సార్లు తీసిన, జనం పదే పదే చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒక కొత్త అనుభూతికి లోనవుతూనే ఉంటారు. గీతాంజలి దగ్గర నుంచి రోజా సినిమా వరకు, తొలిప్రేమ దగ్గర నుంచి మగధీర సినిమా వరకు, అర్జున్ రెడ్డి నుంచి హాయ్ నాన్న వరకు ఇలా గడిచిన 4 దశాబ్దాలలో తెలుగులో ఎన్నో బెస్ట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. ఇన్ని సార్లు తీస్తే జనం కూడా చూసి చూసి అలసిపోతారు. కానీ అదేంటో ఈ లవ్ స్టోరీ ఫార్మేట్ కి అసలు ఎక్సపైర్ డేట్ ఉండట్లేదు. ఏదయినా మంచి ప్రేమ కథ చిత్రం వచ్చిందంటే చాలు జనం థియేటర్స్ దగ్గర వాలీపోతున్నారు ముఖ్యంగా యూత్. అలా ఈ వారం కూడా యూత్ ని ఎట్ట్రాక్ట్ చేయడానికి “మార్కెట్ మహాలక్ష్మీ” అనే మరో ప్రేమకథ వచ్చింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో మన విశ్లేషణలో చూద్దాం.
కథ:
పార్వతీశం ఒక సాఫ్ట్వేర్ పోరగాడు జీవితం లో అత్యంత ఉన్నతమైన విలువులు కలిగిన అబ్బాయి. కొడుకు పెళ్లి ద్వారా కోట్ల రూపాయల కట్నంకి ఆశపడే ఒక తండ్రి. తన తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదొక కారణం చేత రిజెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తనకి ఎన్ని ఉన్నతమైన విలువలు ఉంటాయో, తనకి కాబోయే భార్య కూడా అన్నే ఉన్నతమైన విలువలు ఉండాలనుకుంటాడు. తనకి కాబోయే భార్య బాధ్యతలు, వాటి విలువలు, ఇండిపెండెంట్ గా ఉండగలిగే మనస్తత్వం ఉండాలి అనుకుంటాడు. సరిగ్గా అలాంటి క్వాలిటీస్ ఉన్న మహాలక్ష్మి అనే అమ్మాయి అనుకోకుండా అతనికి ఒక కూరగాయల మార్కెట్ లో పరిచయం అవుతుంది. అక్కడ నుంచి అతను ఆ అమ్మాయిని, అతని తల్లిదండ్రులని ఎలా ఒప్పించాడు, ఈ ప్రాసెస్ లో అతనికి ఎదురయిన సవాళ్లు ఏంటన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ మార్కెట్ మహాలక్ష్మీ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ని ఇష్టపడడం అన్నది కొత్త పాయింట్. దాంట్లో కావాల్సినంత కామెడీ యాంగిల్ ని వాడుకొని ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించొచ్చు. అందుకు తగ్గట్టే దర్శకుడు చాలా వరకు ఆ యాంగిల్ ని వాడుకోగలిగాడు. మార్కెట్ లోని మహాలక్ష్మీ కోసం హీరో అక్కడికి షిఫ్ట్ అవ్వడం. అక్కడే ఉండి ఆ మార్కెట్ లోని జనం మధ్య మహాలక్ష్మీని ఒప్పించే ప్రయత్నంలో అక్కడ ఎదురయ్యే సవాళ్ల మధ్య హీరో పడే పాట్లు చుస్తే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. రెండు ప్రపంచాల మధ్య మూడేసిన విధానం బాగుంది.
నటీనటుల పనితీరు:
ఇన్నాళ్లు సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటా వచ్చిన పార్వతీశం తొలిసారి లీడ్ రోల్లో అదరకొట్టారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెటిల్డ్ యాక్టింగ్ తో చక్కగా చేసారు. మహాలక్ష్మి పాత్రలో చేసిన ప్రణీకాన్వికా కూడా చాలా బాగా చేసింది. మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిగా తన గయ్యాళి తనంతో ఆకట్టుకుంది. కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని చూసుకునే అమ్మాయిగా, అలాగే అంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి తన వెంటపడుతున్న ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా తన ఉన్నతమైన క్యారెక్టర్ ని కోల్పోకుండా ఉన్న విధానం చుస్తే ఈ మహాలక్ష్మి అందరికి నచ్చేస్తుంది. ఇంకా హీరో తండ్రిగా చేసిన కేదార్ శంకర్ గారు కూడా ఒక మధ్యతరగతి తండ్రి ఎలా ఆలోచిస్తాడో, చక్కగా కళ్ళకు కట్టినట్లు చేసి చూపించాడు. ముక్కు అవినాష్, మెహబూబ్ బాషాలు కూడా ఉన్నంతసేపు నవ్విస్తారు. ఈ సినిమాలో వీళ్లిద్దరు ప్రేక్షకులని నవ్వించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. మిగితా వారు కూడా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు.
సాంకేతిక విలువలు:
ఇలాంటి కథలకి కొంచం విభిన్నమైన పనితీరు అవసరం. కథ కొత్తగా ఉంది కాబట్టి, పాటలు చూపించే విధానం కూడా అలానే ఉండాలి. ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కథని పాడుచెయ్యకుండా కథని తెలుపుతూ ఉంటాయి. చివర్లో వచ్చే డిజె పాట అలరిస్తుంది. జో ఎన్మవ్ అందించిన సంగీతం అలరిస్తుంది. ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. ఎడిటింగ్ ఎంత మంచిగా ఉంటే అంత మంచి చేస్తుంది సినిమా కి. ఇలాంటి కథాంశం ని తన ఎడిటింగ్ నైపుణ్యంతో ఇంకా బాగా చూపించారు ఎడిటర్ ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి. కథ ప్రకారం చిత్రీకరణ అంతా మార్కెట్ లోనే ఉండటం, చుట్టుపక్కల ఉండే ప్రదేశాలలో చిత్రీకరించిన సన్నివేశాలని చాలా కలర్ ఫుల్ గా చూపించారు సినిమాటోగ్రాఫర్ సురేంద్ర చిలుముల. నిర్మాణ విలువలు ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకున్నారు. ఇలాంటి కొన్ని అరుదైన కథలని ఎంచుకున్నప్పుడు ఆచి తూచి సన్నివేశాలని రాసుకోవాలి. దర్శకులు మాత్రం చాలా పకడ్బందీగా వ్యవహరించారు. ఒక 3 లేక 4 చిత్రాలని తెరకెక్కించిన అనుభవజ్ఞుడు దర్శకత్వం చేసినట్టు ఉంది. ప్రతీ పాత్రకి ఒక ప్రాధాన్యత ఇచ్చారు.
ఓవరాల్:
ఓవరాల్ గా చెప్పుకుంటే సినిమాలో కొన్ని సన్నివేశాలలో తప్పిదాలు దొర్లి ఉండచ్చు కానీ, మిగితా సినిమా అంతా బాగుంది. ఎక్కడా కూడా చెడు పదాలు ఉపయోగించకుండా సినిమా అంతా క్లీన్ అండ్ నీట్ గా ఉంది. ఈ వీకెండ్ ఫ్యామిలీ తో కలిసి మంచి టైం పాస్ చేయడానికి ఈ సినిమా సరిగ్గా సరిపోతుంది.
రివ్యూ బై: నవీన్ మాదినేని