వి. ఎస్. ముకేశ్ ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు గాని భవిష్యత్తులో మాత్రం “ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది”. ఎందుకంటే యూట్యూబ్లో 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసి ఈరోజు ఒక సినిమా తీసే స్థాయికి రావడమంటే మాటలు కాదు. కలలు అందరు కంటారు కానీ కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకోగల్గుతారు. అది అందరికి సాధ్యపడే విషయం కాదు. దానికి ఓర్పు, సహనంతో పాటు కఠోర శ్రమ అవసరం. బ్యాగ్రౌండ్ ఉంటే ఓకే ఎలాగోలా రాణించొచ్చు. కానీ బ్యాగ్రౌండ్ లేకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, రోజు ఆకలితో పోరాడాలి, అవకాశం కోసం కాళ్ళు అరిగేలా తిరగాలి, ఎందరితోనో మాటలు పడాలి, అయినా కూడా ఎక్కడ కూడా నమ్మకం కోల్పోకూడదు, రోజు కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలి. వింటుంటేనే భయంకరంగా ఉంది కదా. మరి చేసి చూడడం ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ చేయలేక కొంతమంది భయపడి పారిపోయిన వాళ్ళుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ధీటుగా నిలబడతారు. వారి గురించే ఈ ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటుంది. అలాంటి వ్యక్తులలో మన వి. ఎస్. ముకేశ్ గారు కూడా ఒకరు. ఆయన తొలిచిత్రం ఈ వారమే థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మాములుగా తొలిచిత్రం కాబట్టి ఎవరైనా సేఫ్ గేమ్ ఆడతారు. కానీ వి. ఎస్. ముకేశ్ మాత్రం అలా కాదు. తన తొలి ప్రయత్నంతోనే ప్రేక్షకులకి ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేసాడు. అందులో సఫలం కూడా అయ్యాడు. రిలీజైనా తొలి రోజు నుంచే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. టాలీవుడ్ కి మరో మంచి కంటెంట్ ఉన్న దర్శకుడు దొరికాడు అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అలా చిన్న లఘు చిత్రాలు తీసే స్థాయి నుంచి ఈరోజు ఒక మంచి సినిమా తీసిన స్థాయికి ఎదిగిన తీరు చుస్తే అద్భుతం, అమోహం. ఈ తరం అప్ కమింగ్ రైటర్స్ కి వి. ఎస్. ముకేశ్ గారి జీవితం ఆదర్శం. ప్రస్తుతం “మార్కెట్ మహాలక్ష్మి” సినిమాతో మంచి విజయం అందుకున్న వి.ఎస్.ముఖేష్ కి మరియు చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని, భవిష్యత్తులో కూడా వి. ఎస్. ముకేశ్ గారు తన జైత్ర యాత్రని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.