చిత్రం: మహారాజ
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “సేతుపతి మహారాజ విశ్వరూపం”
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, నట్రాజ్, భారతీరాజా, అభిరామి, మమతా మోహన్ దాస్, సచనా నేమిదాస్ తదితరులు
సంగీతం: బి. అంజనీష్ లోకనాథ్
నిర్మాతలు: సుధన్ సుదర్శన్, జగదీష్ పళనిసామి
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
డైలాగ్స్: వసంత్
రచన, దర్శకత్వం: నితిలన్ స్వామినాథన్
విడుదల : 14 జూన్ 2024
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ చిత్రం “మహారాజ”. చేసిన ప్రతీ చిత్రంలో ఏదోక్క వైవిధ్యమైన కథాంశంతో వచ్చే ఆయన, తనకి ఎంతో ముఖ్యమైన 50వ చిత్రం గురించి వివరాలు వెల్లడించాక అంతగా హైప్ రాలేదు. కానీ ఒక్కసారి ట్రైలర్ విడుదల అయ్యాక ఒక రేంజ్ హైప్ వచ్చేసింది. మళ్ళీ సేతుపతి నుంచి ఒక మంచి నటనా ప్రాముఖ్యత ఉన్న చిత్రం వస్తోంది అని భరోసా వచ్చేసింది. అన్నట్టుగానే సేతుపతి గారు తన నటనతో, భావోద్వేగాలతో అందరినీ మైమరపించారు. అసలు ఈ మహారాజ ఎవరు? ఆయన వెతుకుతున్న లక్ష్మీ ఎవరు? ఎందుకు అంత డబ్బు ఇచ్చి మరీ లక్ష్మీ ని వెతకమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ రివ్యూ పూర్తిగా చదవాల్సిందే.
కథ:
మహారాజ (విజయ్ సేతుపతి) ఒక సెలూన్ వ్యాపారి. మొదట్లో ఒకరి దెగ్గర పనిచేసేవాడు, కొంతకాలానికి సొంతంగా అదే వృత్తి చేస్తూ తన కూతురు జ్యోతి (సచనా నేమిదాస్) తో కలిసి సొంతఇంట్లో ఉంటున్నాడు. తల్లిలేని పిల్లని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇద్దరికీ లక్ష్మీ (పాత ఇనపు డబ్బా) అంటే ప్రాణం. ఒక యాక్సిడెంట్ లో లక్ష్మీ నే జ్యోతి ని కాపాడుతుంది. అందుకని దానిని ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఒకరోజు అది దొంగలించబడుతుంది. దాన్ని వెతకమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటానికి వెళితే పిచ్చివాడు అనుకుని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ దాన్ని వెతికి తెస్తే లక్షల్లో డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. అనుమానంతో SI (నట్రాజ్) ఆ కేసుని తీసుకుంటాడు. మహారాజ ఏదో దాస్తున్నాడు అనే అనుమానంతో ఉంటాడు SI. అసలు దొంగతనం గురించి పూర్తి వివరాలు తెలిసాక అందరూ షాక్ కి గురి అవుతారు. అసలు ఆ లక్ష్మీ కథేంటి? ఎందుకు అంత డబ్బు ఖర్చు చెయ్యటానికి కూడా వెనుకాడలేదు ?ఇవన్నీ తెలుసుకోవాలంటే మక్కల్ సెల్వన్ నటించిన “మహారాజ” చూడాల్సిందే.
విశ్లేషణ:
చిత్రంలోని ఒక్కో ముఖ్య పాత్రని పరిచయం చేస్తూ మొదలవుతుంది ఈ చిత్రం. మొదట సాధారణంగా కనిపించినప్పటికీ నెమ్మదిగా ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కూతురితో ఉండే అనుబంధం, కూతురు కోసం ఏదన్నా చేసే స్వభావం, తండ్రి కూతురి మధ్య భావోద్వేగాలు అద్భుతంగా రాసుకున్నారు దర్శకులు. స్క్రీన్ ప్లే కొంచెం కథని ముందుకి వెనక్కి తీసుకువెళుతూ ఉంటుంది. అది మనకి కొంచెం అర్థం చేసుకోటానికి సమయం పట్టినప్పటికీ ఒక్కో పాత్రకి ఉన్న అనుకోని సంబంధం ఈ సినిమాని చాలా అద్భుతంగా ముందుకి నడిపిస్తుంది. ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. ఒక ట్విస్ట్ చూసి ఆశ్చర్యంలోంచి బయటకొచ్చేటప్పటికీ ఇంకోటి వస్తుంది. ప్రతీ ట్విస్ట్ కీ కథలోని కారణం మారిపోతుంది. సెల్వ (అనురాగ్) అదే ఊరిలో ఎలక్ట్రిక్ షాప్ నడిపే వ్యక్తి. అతనికి తన కూతురు అంటే ప్రాణం. అనుకోని సంఘటనలు వాళ్ళ ఇద్దరు జీవితాలు మలుపు తిప్పుతాయి. ఒక అద్భుతమైన ట్విస్ట్ తో మొదటి భాగం ముగుస్తుంది.
ఇంటర్వెల్ దెగ్గర వచ్చిన ట్విస్ట్ నుంచి కథ ఇంకా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. మహారాజ నుంచి వీలైనంత డబ్బు గుంజాలి అనుకునే పోలీస్ వాళ్ళకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకోటానికి నట్రాజ్ చేసిన పనేంటి, అసలు లక్ష్మీ కి ఏమయ్యింది, ఒక డబ్బా కోసం ఎందుకు మహారాజ అంత అవమానాలు పడ్డాడు, ఎందుకు అంత డబ్బు ఖర్చు చేసాడు అనేది క్లైమాక్స్ లో చూపించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది.
నటీనటుల పెర్ఫార్మన్స్:
మక్కల్ సెల్వన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పూర్తి భావోద్వేగం చూపించే పాత్రలో ఒదిగిపోయారు. బాధ, కోపం, ఆవేశం, మంచితనం తప్ప ఇంకో భావోద్వేగం లేని పాత్రలో ఆయన నటన అమోఘం. తన 50వ చిత్రంలో ఇలాంటి కథని ఎంచుకున్నారు అంటే సాహసమే. కానీ ఆయనకి సినిమా మీద ఉన్న మక్కువ చూపుతుంది ఈ చిత్రంలో ఆయన నటన. టీచర్ గా మమతా మోహన్ దాస్ తన వంతు పాత్ర మంచిగా పోషించారు. ప్రతినాయకుడిగా అనురాగ్ కశ్యప్ ని మొదట చూసాక తనని కాకుండా ఇంకెవరన్నా అయ్యుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ముఖ్యమైన కథలోకి వెళ్ళాక ఆయన తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు అనిపించేలా మెప్పించారు. SI గా నట్రాజ్ పాత్ర మొదట చిరాకు పెట్టినప్పటికీ క్లైమాక్స్ లో అద్భుతమైన నటనతో మెప్పిస్తారు. సచనా నేమిదాస్ జ్యోతి పాత్రలో అద్భుతంగా నటించారు. కూతురిగా తండ్రితో ఉండే చనువు, తనని చూసుకునే విధానం దానికోసం చెయ్యాల్సిన ప్రదర్శన తన వయసుకన్నా ఎంతో నేర్పు ఉన్న నటులు చేసినట్టుగా చేసారు. ముఖ్య పాత్రల్లో భారతీరాజా, అభిరామి మెరిశారు.
సాంకేతిక విలువలు:
ఈ చిత్రంలో సాంకేతికంగా మెచ్చుకోవలసింది రచయిత, దర్శకులు నితిలన్ స్వామినాథన్ గారిని. ఒక సెన్సిటివ్ కథని ఇంత అద్భుతంగా రాసుకున్నారు ఆయన. ప్రతీ పాత్రకి ఒక ప్రాధాన్యత, ప్రతీ పాత్రలో కథ ఉంటుంది. అది చూపించిన విధానం చాలా బాగుంది. సినెమాట్రోగ్రఫీ, ఎడిటింగ్ ఈ చిత్రానికి మంచి అండగా నిలిచాయి. కొంచెం స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా చూపించినప్పటికీ అది కథలో ప్రక్రియలాగా సాగిపోతుంది. మ్యూజిక్ అందించిన బి. అంజనీష్ లోకనాథ్ గారిని మెచ్చుకోక తప్పదు. ఉన్నది రెండు పాటలు అయినప్పటికీ బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కథకి పట్టు చేకూర్చారు. పోరాట సన్నివేశాలు కూడా బాగున్నాయి. కథకి తగ్గట్టుగా మాటలు, సన్నివేశాల విశ్లేషణ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. స్క్రీన్ ప్లే కొంచెం కలవరపెట్టే అంశంగా పరిగణించొచ్చు. కథ పరంగా కొంచెం ప్రెడిక్ట్ చేసే విధంగా ఉన్నప్పటికీ చూపించే విధానం కొత్తగా ఉంటుంది.
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి