OTT సిరీస్: యక్షిణి
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: “రెండు దేవలోకాల ప్రతీకారాల పోరాటమే యక్షిణి కథ”
నటీనటులు: రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి, అజయ్, జెమినీ సురేష్ తదితరులు
సంగీతం: ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యం
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
రచన : రామ్ వంశీ కృష్ణ
దర్శకత్వం: తేజ మార్ని
విడుదల : 14 జూన్ 2024
ఎవరికీ అంతగా తెలియని పురాణ గాధలని, చాలా వినూత్న రీతిలో చూపించే ప్రయత్నమే యక్షిణి. ఈ మధ్య వస్తున్న పురాణాల నేపధ్య ధోరణి చిత్రాలు, సిరీస్ ల జాబితాలో తాజాగా చేరింది యక్షిణి. ఇది పురాణాల ప్రకారం నాగలోకానికి, కుబేర లోకమైన అల్కాపురి కి మధ్య జరిగే ఒక ఘర్షణ, భూలోకంలో శాపగ్రస్త యక్షిణి కి సంబంధిత కథ. సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండగా ప్రేమ, పగ, పోరాటాల మధ్య జరిగే సన్నివేశాలని బాగా రాసుకున్నారు. చాలా కాలం తరువాత తెలుగు తెరమీద కనిపించిన వేదిక గారికి, ఇప్పుడిప్పుడే తన టాలెంట్ తో పైకి వస్తున్న రాహుల్ గారికి ఈ సిరీస్ చెయ్యటం ఒక వినూత్న ప్రయత్నం. కథ పరంగా కమర్షియల్ చిత్రాలలో చాలా సార్లు చూసినట్టు అనిపించినప్పటికీ ఎవరు చెయ్యాల్సింది పాత్రలకి న్యాయం వాళ్ళు చేసారని మాత్రం కచ్చితంగా చెప్పచ్చు. అసలు ఈ సిరీస్ దేనిగురించి, ఎలా ఉంది అనే విశ్లేషణ ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
రావణాసురిడి అన్నయ్య అయిన కుబేరుడు, రావణుడి మరణం తరువాత నాగలోకానికి దండెత్తి, చాలా వినాశనం సృష్టించి, ఎంతో విలువైన సంపదని తన రాజ్యం అయిన అల్కాపురికి తీసుకొస్తాడు. ప్రతీకార వాంఛతో రగిలిపోయే నాగవంశీకులు చాలా ప్రయత్నాల తరువాత భూలోకంలో శాపంతో తిరుగుతున్న యక్షిణి మాయ (వేదిక) ని కనుగొంటారు. అలా కనుగొన్నది నాగలోక వంశానికి చెందిన వ్యక్తి మహాకాళ్ (అజయ్). మాయ శాపం నుంచి బయటపడాలంటే కుబేరుడు చెప్పిన పరిష్కారాన్ని చెయ్యాలి. అలా చేస్తే తనకి భూలోకంనుంచి విముక్తి కలుగుతుంది, అల్కాపురికి తిరిగి వెళుతుంది. అల్కాపురి ప్రవేశంకోసం మహాకళ్, మాయ ని ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కృష్ణ(రాహుల్) తో పరిచయం అవుతుంది మాయ కి. మధ్యలో ఇంకొక శాపగ్రస్త యక్షిణి అయిన జ్వాలాముఖి (మంచు లక్ష్మి) మాయ మీద ఈర్షతో మహాకాల్ కి సహాయం చేస్తుంది. అసలు మాయ కి శాపం ఎందుకు వచ్చింది? కుబేరుడు ఇచ్చిన పరిష్కారం ఏమిటి? మాయ ప్రాణాలతో మహాకళ్ కి ఎందుకు కావాలి? మాయ కి కృష్ణ కి సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న సిరీస్ “యక్షిణి” చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ మధ్య అన్ని చిత్రాలలోనూ ఏదోక్క విధంగా పురాణాలను ఇరికిస్తున్నారు. సెంటిమెంట్ వల్ల అయినా అవ్వచ్చు, మరేమన్నా కారణం వల్లనైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా విననివి కూడా కల్పితంగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతోంది. యక్షిణి కూడా అదే కోవకి చెందిన సిరీస్ అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా తెరకెక్కించిన విధానం బాగుంది, నటీ నటుల పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. వేదిక గారికి తన అందానికి తగ్గ పాత్ర లభించింది. సిరీస్ మొత్తం ఆమె అందాలతో తళుక్కుమంటూనే ఉంటారు. కొంచం అక్కడక్కడా కామెడీ కలపటానికి ప్రయత్నించినా కూడా అంతలా ఫలితం ఇవ్వలేదు. ఈ సిరీస్ మొత్తానికి ముఖ్యమైన పాత్రలు ముగ్గురు. మాయ, కృష్ణ, మహాకళ్. దాదాపుగా కథ మొత్తం ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలనే కాంక్షతో ఉండే హీరోగా రాహుల్ గారు మెప్పించే ప్రయత్నం చేసారు. ఈ సమాజంలో పెళ్ళిళ్ళు ఎంతటి మోసాలతో అవుతున్నాయి, దానివల్ల కుటుంబాలకి కలిగే బాధలు, అన్నీ మంచిగానే చూపించే ప్రయత్నం చేసారు. ఒక దేవకన్య మానవుడి వెనకాల పడటం ఇదివరకు చాలాసార్లు చూసాము. దేవకన్య గా ఒక యక్షిణినిగా వేదిక గారు ఒదిగిపోయారు. ఆవిడ అందచెందాలతో ఈ పాత్రకి చాలా ప్రాణం పోశారు. ఒక తాంత్రికుడిగా అజయ్ చేసిన నటన కూడా అలరిస్తుంది. కుటుంబ సభ్యలు అందరూ ఒక్కో విధంగా వ్యవహరించటం, కృష్ణ విషయంలో పెళ్ళి కి తొందరపెట్టటం అన్నీ కూడాను నిజజీవితంలో చాలా మంది అనుభవించే అంశాలే. అన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు.

సాంకేతిక విలువలు:
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్కా మీడియా మంచిగానే ఖర్చుచేసినట్టు కనిపిస్తోంది. పోరాట సన్నివేశాలలో గ్రాఫిక్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వర్క్ అవ్వలేదు అనిపించాయి. ముఖ్యంగా పాముల గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అనిపించింది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఉన్నది. సిట్యుయేషన్ కి తగ్గట్టుగా వైవిధ్యమైన మ్యూజిక్ అందించారు ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యం. రామ్ వంశీ కృష్ణ ఒక కొత్త కథని అందిద్దాం అని అనుకున్నారు. స్క్రీన్ ప్లే లో కొంచం బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా మంచిగా ఉంది. యూట్యూబ్ బ్లడీ నాన్సెన్స్ మేనేజర్ సాయికిరణ్ తదితరులు కృష్ణ స్నేహితులుగా తమవంతు నటన బాగా చేసారు, కామెడీ చేసే ప్రయత్నం చేసారు. దర్శకులు తేజ మార్ని ఒక విభిన్నమైన కథమాంశం ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. కొంతమేరకు మంచిగా చేయగలిగారు అని చెప్పొచ్చు. కథ పరంగా కొంచెం ఎప్పుడో చూసినట్టు అనిపించినప్పటికీ తెరకెక్కించిన విధానం బాగుంది.
రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి