అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకి కొంతమంది కన్నడ ప్రేక్షకులకి మాత్రమే తెలిసిన ఒక పేరు 9 సంవత్సరాల క్రితం నుంచి యావత్ ప్రపంచం గుర్తించటం మొదలు పెట్టింది. జపాన్ లో కూడా అభిమానులు ఉన్నప్పటికీ ఒక అద్భుతమైన చిత్రం తన జీవితం మార్చేసింది. అదే “బాహుబలి”. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ ని తెలుగు నటుడు అనే కాకుండా యావత్ ప్రపంచం తనని అభిమాన నటుడిలా కీర్తించేలా చేసింది. మహేంద్ర బాహుబలి గా, అమరేంద్ర బాహుబలిగా రెండు పాత్రలని ఒక నిజమైన రాజరికపు నటనతో అదరకొట్టారు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయ్యారు. రికార్డ్స్ పేరు చెప్పాలంటే అది ప్రభాస్ చిరునామాగా మార్చుకున్నారు ఆయన. హిట్, ప్లాప్ సంబంధం లేకుండా ఆయన చిత్రాలు రికార్డ్స్ మోత మోగించటం మొదలు పెట్టాయి. బాహుబలి మొదటి భాగం విడుదల అయ్యి ఈరోజుతో 9 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ ఒక్క చిత్రం తెలుగు చిత్రసీమ స్థాయి మార్చేసింది. రికార్డ్స్ గురించి మాట్లాడితే బాహుబలితో పోల్చుకునేలా చేసింది. ఒక్క తెలుగు గడ్డమీద మాత్రమే కాదు, హిందీ గడ్డమీద కూడా ప్రభాస్ తన గెలుపు జెండా పాతేశారు. అక్కడ ఖన్స్ చిత్రాలని కూడా తలదన్నేలా ఉన్నాయి ప్రభాస్ చిత్రాలకి సంబందించిన రికార్డ్స్.
బుక్ మై షో అప్లికేషన్ లో కూడా ప్రభాస్ చిత్రం టికెట్స్ బుకింగ్ రికార్డు ని ఎవ్వరూ దెగ్గరలోకి వచ్చేలా కూడా లేదు. స్వతహాగా రాజు అయిన ప్రభాస్, నిజమైన రాజు దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన కల్కి 2898 AD అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి తో భారీ బడ్జెట్ చిత్రాలకి తెరలేపారు ప్రభాస్. అప్పట్లోనే ఈ చిత్రం 250 కోట్లతో చిత్రీకరించారు. ఇప్పుడు భారీ బడ్జెట్ అంటే కనీసం 500 కోట్లు అనేలా చేసారు ప్రభాస్. ఆయనతో చిత్రం అంటే కళ్ళుమూసుకుని ఎంతైనా ఖర్చు చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. బాహుబలి తరువాత వచ్చిన సాహో ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ హిందీ గడ్డమీద తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. తెలుగు వెర్షన్ కన్నా హిందీ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు, ప్రభాస్ చిత్రాలకి టాక్ తో సంబంధం లేదు అని. టాక్ ఏదైనా సరే నిర్మాతలకి వసూళ్ల మోత మోగుతుంది అని. మన తెలుగు ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్, ఇలానే తన ఖ్యాతిని కొనసాగించాలని కోరుకుందాం. బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనకందించిన రాజమౌళి గారికి చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం.