చిత్రం : భారతీయుడు 2
రేటింగ్: 3.75/5
బాటమ్ లైన్: “అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించడానికి ఎప్పటికీ సిద్ధం అంటున్న భారతీయుడు”
నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, మనోబాల, వివేక్, బాబీ సింహ, సముథిరఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేష్ బ్రహ్మానందం తదితరులు
సంగీతం: అనిరుధ్
నిర్మాతలు: సుభాస్కరన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రచన: చంద్రశేఖర్, జయామోహన్, వంశీ కృష్ణ
దర్శకత్వం: శంకర్
విడుదల : 12 జులై 2024
1996 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి సంచలనం సృష్టించిన చిత్రం భారతీయుడు. భారతీయ వ్యవస్థలో, చాలా మంది అధికారుల నరనరాల్లో కూరుకుపోయిన అవినీతిని ఏరేసే యోధుడిగా నటించి మెప్పించారు కమల్ గారు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా భారతీయుడు 2 విడుదల అయ్యింది. రెండు పాత్రలు తప్పా అంతా కొత్త పాత్రలతో తెరకెక్కించారు ఈ చిత్రం. ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకుని, యువతని మార్చే క్రమంగా చిత్రీకరించారు ఈ అబ్దుతమైన కథాంశంని. ఇండియన్ తాత గా ఎప్పటిలానే అదరకొట్టిన లోకనాయకుడు. ప్రాచీన యుద్ధ కళ “మర్మకళ” ని ఇంకా చాలా కోణాలలో చూపించారు కూడాను. సిద్ధార్థ్, రకుల్, ప్రియా ఇలాంటి నటులు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. భారతీయుడు మళ్ళీ ఎందుకని వచ్చారు, ఆయనని ఎవరు రప్పించారు, వచ్చాక ఆయన వలన జరిగిన పరిణామాలేంటి అనేది ఈ విశ్లేషణలో చూద్దాం.
కథ:
చిత్ర వారాధరంజన్ (సిద్ధార్థ్) తన స్నేహితులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. ఊరిలో జరిగే ప్రతీ అవినీతిని ప్రశ్నిస్తూ, ఆ పాత్రల్లో వల్లే నటిస్తూ అందికీ ఆ సమాచారాన్ని చేరుస్తూ ఉంటారు. అనుకోకుండా తన స్నేహితురాలు ఆర్తి (ప్రియా భవానీ శంకర్) పక్కన ఇంట్లో ఉండే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబందించిన అధికారి ఇంట్లో అవినీతి నిర్ములన శాఖ, ఇన్కమ్ టాక్స్ శాఖ దాడులు జరిపి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెడతారు. అక్కడనుంచి వీళ్ళ జీవితం మారుతుంది. కనిపించిన ప్రతీ అవినీతిని వేలెత్తి చూపి చిక్కుల్లో పడతారు. ప్రశ్నించినందుకు వాళ్ళకి ఎదురైనా అవమానాన్ని భరించలేనప్పుడు ఇలాంటి అవినీతిని కొన్ని సంవత్సరాలక్రితం రూపుమాపిన ఇండియన్ తాత సేనాపతి (కమల్ హాసన్) మళ్ళీ తిరిగిరావాలని అనుకుంటారు. ఆయన బతికున్నారో లేదో అని కనిపెట్టడానికి, ఆయన బతికి ఉంటే ఇండియా కి రావాలని ట్విట్టర్ వేదికగా “కమ్ బ్యాక్ ఇండియన్” ట్యాగ్ ని సృష్టించి అప్పటిదాకా తను స్నేహితులతో కలిసి కనిపెట్టిన సమస్యలని వివరిస్తాడు. అది ధవావాగ్నిలా మారి ప్రపంచం అంతటా పాకి సేనాపతిని ఇండియా వచ్చేలా చేస్తుంది. ఆయన ఎందుకు రావాలని నిర్ణయించుకున్నారు, వచ్చి ఆయన ఏమేమి చేసారు అనేది మిగిలిన కథాంశం . ఈ సంఘటనలతో సకల కళా వల్లవన్ (SJ సూర్య) కి సంబంధం ఏమిటి అనేది చిత్రం చూసి తెల్సుకోవలసిందే.
విశ్లేషణ:
మొదలవుతూనే ఒక సమస్యని బయటపెట్టే కార్యక్రమంతో మొదలవుతుంది ఈ చిత్రం. ఎక్కడా కూడా ఆలస్యం చెయ్యకుండా ఇంకా చాలా సంఘటనలని వెంటవెంటనే చూపించేస్తారు. ఉద్యోగ సమస్య, విద్యాసంస్థల వలన సమస్య, చెత్త సమస్య. ఇలాంటివి చాలానే చూపించి ప్రశ్నిస్తూ ఉంటారు చిత్ర చిత్ర వారాధరంజన్ ఇంకా తన స్నేహితులు. వీళ్ళు నలుగురూ కలిసి చాలా పోరాటాలు చేస్తూ, సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు కలిగిన సమస్యనుంచి చిత్ర వారాధరంజన్ ప్రియురాలు (రకుల్ ప్రీత్ సింగ్) వల్ల బయటకొస్తాడు. కానీ ప్రతీ సారి తను వేలెత్తి చూపించిన సమస్య అసలు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో ఇవన్నిటినీ ఆపే శక్తి ఉన్న వ్యక్తి ఒక్క సేనాపతి (కమల్ హాసన్) అని నిర్ణయించుకుని ఆయన్ని వెనక్కి ఇండియా కి రప్పించే ప్రయత్నం చేస్తాడు. ఆయన అనుకోని విధంగా ఇండియాకి తిరిగివచ్చి ఎప్పటిలానే కలుపు ఏరే ప్రక్రియ మొదలు పెడతారు. ఒక మంచి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పటిదాకా చూపించిన చాలా అంశాలు పాత్రలు మనం నిజజీవితంలో చాలా సార్లు చేసినవే అయ్యి ఉండటం గమనార్హం.
ఎలాగ ఒక మంచి ఇంటర్వెల్ తో మొదటి అధ్యాయాన్ని ఆపారో అలానే రెండొవ అధ్యాయం కూడా మొదలవుతుంది. అన్యాయాన్ని ఆపే ప్రయత్నంలో దానికి మూల కరుకలని పట్టుకోవటం, శిక్షించటం చాలా బాగా చూపించారు. ఈ రెండొవ అధ్యాయంలో వచ్చిన పోరాట సన్నివేశాలు అయితే అద్భుతం. ఈ చిత్రం చిత్రీకరణ మొదలయినప్పుడు ఉన్న కొంతమంది నటులు మధ్యలో కాలం చేసినందువలన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సు ఉపయోగించి కొన్ని సన్నివేశాలలో వాళ్ళని గ్రాఫిక్స్ లో చూపించారు. ముఖ్యంగా CBI అధికారిగా చేసిన వివేక్ గారిని, మనోబాల గారిని, భారతీయుడు లో CBI ఆఫీసర్ గా చేసిన నెడుముడి వేణు గారిని. కొన్ని సన్నివేశాలలో వాళ్ళు ఉన్నప్పటికీ కొన్నిట్లో లేకపోవటంతో అలా చేసారు. రెండొవ అధ్యాయం చివర్లో ఈ చిత్రానికి సంబందించిన మూడవ పార్ట్ కి లీడ్ వదులుతారు దర్శకులు.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
సేనాపతి గా కమల్ గారు విశ్వరూపం చూపించారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎంతో ఓర్పు ఉండాలి ఈ వయస్సులోకూడా ఇలాంటి పాత్రలు చేస్తునందుకు. వివిధ ప్రాంతాలకి తగ్గట్టుగా, వివిధ భాషలకి తగ్గట్టుగా ఆయన మేకప్, నటన, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇండియన్ తాత అని పేరు వినగానే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్, SJ సూర్య, సముథిరఖని ఇలా అందరూ అద్భుతంగా నటించారు. కథలో కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి అవి సినిమా చూసే తెలుసుకోవాలి . కొన్ని సందర్భాలలో సీరియస్ సిట్యుయేషన్లో కూడా కమల్ గారు కామెడీ పండించే ప్రయత్నం చేసారు. సిద్ధార్థ్ గారిని ఇలాంటి యువతకి దెగ్గరచేసే పాత్రలో చూడటం సంతోషంగా ఉంటుంది సినీ అభిమానులకి. కమల్ గారు, సిద్ధార్థ్ గారు వాళ్ళ భుజాలమీద మోశారు ఈ చిత్రాన్ని.
సాంకేతిక విభాగం:
ముఖ్యంగా మెచ్చుకోవలసింది సంగీత దర్శకుడు అనిరుధ్ ని. మొదటి పార్ట్ కి రెహ్మాన్ గారు ఇచ్చిన సంగీతం అమోఘం. ఆ పాటలు ఇప్పటికీ అందరూ వింటూ ఉంటారు. అలాంటి చిత్రానికి కొనసాగింపుగా వస్తున్నప్పుడు సినీప్రియులకి ఎంతోకొంత అంచనాలు ఉంటాయి. అనిరుధ్ ఇచ్చిన సంగీతం, బాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉర్రూతలూగిస్తుంది. శంకర్ గారి చిత్రాలు అంటే సామాజిక అంశాలమీదనే ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఈ చిత్రంలో తన మునపటి చిత్రాలకి సంబంధించి కొన్ని అంశాలని పెట్టి కొంచం ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. టైటిల్ పడిన తీరు చాలా కొత్తగా ఉంది. కమల్ గారిని చూపించిన విధానం, తనదైన శైలిలో ఉండే కథనం, సమాజంలో జరిగే వాటిని లోతుగా మనసుకి హత్తుకునేలా చెప్పటం ఆయన తరువాతే ఎవరైనా. కొంచెం అక్కడక్కడా నెమ్మదిగా నడిచినప్పటికీ కమల్ గారిని చూసాక అవన్నీ మర్చిపోతాం. రవి వర్మ ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్ గా ఉంది. ముఖ్యంగా కమల్ గారిమీద చూపించిన ఫ్రేమ్స్ బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కూడా వెనుకాడకుండా సినిమాకి మొత్తం అంతా సమకూర్చారని తెలుస్తోంది చిత్రం యొక్క తీరుని చూస్తుంటే. రచయితలు కూడా చాలా చక్కని అంశాలని సేకరించి కథని మంచిగా మలిచారు.
బాటమ్ లైన్: “అన్యాయం ఎక్కడ ఉంటే దాని ఎదిరించడానికి భారతీయుడు అక్కడ ఉంటాడు – మనమే అది” కచ్చితంగా కుటుంబంతో సహా చూడాల్సిన చిత్రం
రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి