కొన్ని సినిమాలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులని ఆలోజింపచేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తాయి. అలాంటి సినిమాలు చూస్తునంత సేపు ప్రేక్షకులు ఒక సినిమా కాకుండా నిజజీవితాన్నే చూస్తున్నాము అనే ఫీల్ కి లోనవుతారు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఉదాహరణికి నాని హీరోగా నటించిన ” జెర్సీ ” సినిమా. ఇప్పుడు ఈ “కమిటీ కుర్రోళ్ళు” కూడా ఆ కోవకు చెందిన సినిమానే. “శంకరాభరణం”, “స్వాతిముత్యం”,”సాగర్ సంగమం” లాంటి సినిమాలు సాధించిన విజయాల్ని డిఫైన్ చేయడానికి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్ లాంటి పదాలు వాడకూడదు. ఎందుకంటే ప్రేక్షకుల హృదయాల్ని గెలిచిన దానికంటే పెద్ద విజయం ఉండదు. అందుకే అలాంటి పదాలు వాడితే ఆ సినిమాని అవమానించినట్లే. “కమిటీ కుర్రోళ్ళు” సినిమా సాధించిన విజయం కూడా అలాంటిదే.
ఈ సినిమాలోని పాత్రలు, ఆ పాత్రలు తమ బాల్యంలో చేసిన చిలిపి అల్లరి చూస్తే ఎవరికైనా తమ మధురమైన బాల్య జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. ప్రతి మనిషి జీవితంలో బాల్యం అనేది ఒక మధురమైన జ్ఞాపకం. చిన్నపుడు స్కూల్ లో ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి, ఫస్ట్ లవ్, స్వచ్ఛమైన స్నేహం ఇవన్నీ కేవలం బాల్యంలో మాత్రమే దొరుకుతాయి. అందుకే మనం ఎంత సంపాదించిన కొనలేనిది తిరిగి తీసుకురాలేనిది ఒక్క బాల్యం మాత్రమే. ఇప్పటి యూత్ అంత 90స్ , ఎర్లీ 2k కిడ్స్ కావడంతోనే, చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ కూడా ఆ జనరేషన్ కి సంబంధించినవే పెట్టారు. అంతే కాకుండా గోదావరి జిల్లాల అందాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, గ్రామాల్లో జరిగే కుల- రాజకీయ ఘర్షణలు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ యదు వంశీ. అందరు కొత్త నటులైనప్పటికీ అందరికి తమ సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ఇంత భావోద్వేగాలతో కూడిన సహజసిద్ధమైన కథ ని ఎక్కడ బోర్ కొట్టకుండా 3గంటల సేపు ప్రేక్షకులని కుర్చోపెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో నేర్పు ఉండాలి. తన ఫస్ట్ సినిమానే అయినా దర్శకుడు యదు వంశీ కథని నడిపిన తీరు చుస్తే ఎంతో “అద్భుతం”, “అభినందనీయం”, “ప్రశంసనీయం”. ముఖ్యంగా క్లైమాక్స్ లో దర్శకుడు యదు వంశీ చూపిన పరిణితి కి ఎవరికైనా చప్పట్లు కొట్టడం ఖాయం. మెగా ప్రిన్సెస్ కొణిదెల గారికి కూడా అభినందనలు. తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి భావోద్వేగంతో కూడిన కధ ని ప్రేక్షకులకి అందించినందుకు హ్యాట్సాఫ్.