- Advertisement -spot_img
HomeMoviesTollywoodపూరి, రామ్ "డబుల్ ఇస్మార్ట్" రివ్యూ - FilmCombat

పూరి, రామ్ “డబుల్ ఇస్మార్ట్” రివ్యూ – FilmCombat

- Advertisement -spot_img

రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి

చిత్రం: డబల్ ఇస్టమర్ట్
విడుదల తేదీ: 14.08.2023
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: మార్ ముంత ….జోరు హాంఫట్ …

నటి నటులు: రామ్ పోతినేని, కావ్య తప్పర్, సంజయ్ దత్ , మార్కండ్ దేష్పాండే, సాయాజీ షిండే, ఝాన్సీ, VJ బాణి, ఆలీ తదితరులు

సంగీత దర్శకుడు: మణిశర్మ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: గైన్ని గియాన్నెల్లి
నిర్మాత: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
మూవీ బ్యానర్: పూరి కనెక్ట్స్
స్క్రీన్ ప్లే, రచయితలు, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్

ఎంతో కాలంగా హిట్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్, రామ్ పోతినేని మళ్ళీ కలిసి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఎక్కడా కూడా తన మార్క్ కనపడకుండా పూరి గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనమీద ఉన్న అభిమానంతో చేసేస్తారు అనుకుని తీశారో, లేకపోతే మొదటి భాగం ఒక మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది కాబట్టి ఆ ఫ్లో లో హిట్ అవుతుంది అనుకున్నారేమో తేలేదు కానీ, ప్రేక్షకుల సహనాన్నిబాగా పరీక్షించారు ఆయన. నటన పరంగా రామ్ గారు మెప్పించినప్పటికీ ఆయన పాత్ర చూడగా చూడగా చిరాకు తెప్పిస్తుంది. మాటకి ముందొక బూతు, చివర్లో ఒక బూతు. ఇదే పంధాలోనే సాగుతుంది సినిమా అంతా. హీరోనే కాదు, కనిపించిన ప్రతీ పాత్ర బూతులు మాట్లాడినవాళ్ళే ఒక్క ఝాన్సీ గారు తప్ప. అసలు పూరి గారు , రామ్ గారితో తెరకెక్కించిన “డబుల్ ఇస్మార్ట్” అనే చిత్రాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దాం ఈ రివ్యూలో.

కథ:

తన తల్లి పోచమ్మ (ఝాన్సీ) అంటే శంకర్ (రామ్) కి ప్రాణం. ఆవిడ కోసం ఏదన్నా చేస్తాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న శంకర్, కొన్నాళ్ళకు తల్లిని కూడా పోగొట్టుకుంటాడు. అప్పటినుంచి ఇలా చిల్లర దొంగతనాలు, రౌడీ గా ఉంటూ బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడూ బిగ్ బుల్ అనే వ్యక్తికి సంబంధిన డబ్బులు దొంగతనం చేస్తూనే ఉంటాడు. బిగ్ బుల్ (సంజయ్ దత్) ఒక పెద్ద మాఫియా డాన్. అతన్ని పట్టుకోడానికి సిబిఐ ఆఫీసర్ (షియాజీ షిండే) ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక అనుకోని సంఘటన శంకర్ ని, బిగ్ బుల్ ని కలుపుతుంది. ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళకి ప్రమాదం అనే సందర్భం వస్తుంది. ఈ సందర్భంలో మళ్ళీ శంకర్ కి మెమరీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈసారి బిగ్ బుల్ కి సంబంధిన మెమోరీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు సైంటిస్ట్ (మార్కండ్ దేష్పాండే). దానివల్ల అసలు ఎలాంటి పరిణామాలు వచ్చాయి? మెమరీ ట్రాన్స్ఫర్ చెయ్యటానికి కారణం ఏంటి? శంకర్ బిగ్ బుల్ కి సంబందించిన డబ్బునే ఎందుకు కొట్టేస్తున్నాడు? శంకర్ కి జన్నత్ (కావ్య) కి సంబంధం ఏమిటి? సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

మొదలు పెడుతూనే చైనాలోని ఒక ప్రదేశంలో బిగ్ బుల్ ఎంట్రీ చూపిస్తారు. వచ్చి రాగానే ఒక 15 మందిని ఒంటి చేత్తో నరికేస్తాడు బిగ్ బుల్. తరువాత ఒక అనుకోని కారణం చేత తను హైదరాబాద్ లో వీధి రౌడీ అయిన శంకర్ ని వెతకటం మొదలు పెడతాడు. తన మనుషులు ఎంతమంది వచ్చి పట్టుకోవాలి అనుకున్నా శంకర్ ని పట్టుకోలేరు. ఈ క్రమంలో శంకర్ బిగ్ బుల్ కి సంబందించిన డబ్బులు కొట్టేస్తూ ఉంటాడు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగా జన్నత్ తో ప్రేమలో పడతాడు శంకర్. తను బిగ్ బుల్ పబ్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. శంకర్ వలన ఆ ఉద్యోగం కూడా పోతుంది. శంకర్ ని పట్టుకునే క్రమంలో జరిగే పోరాటాలతో సౌండ్ సిస్టం దద్దరిల్లుతుంది. కానీ మాటకి ముందు వెనకాల కచ్చితంగా బూతులు మాత్రం దండిగా ఉంటాయి. ఒక సాధారణ సంభాషణ ఈ మొత్తం చిత్రంలో ఎవ్వరూ కూడా చెయ్యకపోవడం ఆశ్చర్యం. ఈ మధ్యలో ఆలీ గారిని బోకా అనే ఆదివాసి పాత్రలో తీసుకొస్తారు. ఈ పాత్రకి కథకి అసల సంబంధం కూడా ఉండదు. ఎక్కడా కూడా ఆలీ గారు ముఖ్య పాత్రలతో కలవను కూడా కలవరు. ఆయన పాత్రకి ఏదో ఒక కొత్తరకమైన బాష జతచేసి అన్నీ డబల్ మీనింగ్ అర్థాలతో అర్థం లేని, అవసరం లేని కామెడీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆలీ గారు వచ్చినప్పుడు ప్రతీసారి సాఫీగా సాగుతున్న కథలో బ్రేక్ పడుతుంది. ఒక విచిత్రమైన లాజిక్ తో మొదటి భాగం ముగుస్తుంది.

రెండొవ భాగం అయినా బాగుంటుందేమో అనుకునే ప్రేక్షకులకి మళ్ళీ నిరాశనే మిగులుతుంది. ఒక దశాబ్దం కిందట వచ్చిన ఒక తమిళ చిత్రంలో కనిపించిన తండ్రీ కొడుకుల గొడవ, దానివలన తండ్రి చనిపోవటం. ఇలాంటి కథాంశం చూపించారు దర్శకులు. ఎక్కడా కూడా ప్రేక్షకులని కథకి, కారణానికి ఆకట్టుకునేలా కించిత్ ప్రయత్నం కూడా చెయ్యలేదు. అనవసరమైన పోరాటాలు, అనవసరమైన తప్పుడు మాటలు, అనవసరమైన బలవంతపు కామెడీ ప్రేక్షకులని అసలు సీట్లో ఉండనివ్వదు. చివర్లో శివుడి కాలభైరవ అష్టకం పెట్టేసి శివుడి ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. కనీసం శివుడైన కాపాడతాడేమో సినిమాని అనుకున్నారేమో. చివర్లో వచ్చే శివాలయం పోరాట సన్నివేశాలు తప్ప ఇంకేం ఎక్కదు ప్రేక్షకులకి. అసలు ఎవరికీ రాకూడని ఒక చెత్త ఆలోచన సంజయ్ దత్ పాత్రకి వస్తుంది. ఆయనకి సంబందించిన మిషన్ ఒకటి ఉంటుంది, ఆ విషయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో చాలా ఘోరాలు జరుగుతాయి కూడాను.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

శంకర్ గా రామ్ గారు తనవంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మొత్తం ఓల్డ్ సిటీ కుర్రోడిలాగా మాస్ అవతారం, మాటలు, నడవడిక అన్నీ అలానే ఉండేలా నటించారు. జన్నత్ గా కావ్య గారు ఆవిడకి ఇచ్చిన పాత్రని మంచిగా ఉపయోగించుకున్నారు. సంజయ్ దత్ గారిని బిగ్ బుల్ గా చూపించే ప్రయత్నం బాగుంది, కానీ అలంటి పాత్రకి ఆయననే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకి మనకి సమాధానం అస్సలు దొరకదు. పేరుకి మాఫియా డాన్ అయినప్పటికీ, డాన్ లాగా ఒక్క ఫ్రేములో కూడా కనిపించలేదు, వ్యవహరించలేదు. ఆయన అసిస్టెంట్ బెంట్లే (బాణి) ఒక మోస్తరుగా ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. గెటప్ శీను తనకు ఉన్న పరిధిలో మంచిగా నటించారు, తల్లిగా ఝాన్సీ గారు, చివర్లో ప్రగ్న్య గారు ఆకట్టుకున్నారు. సినిమా మొత్తానికి చిరాకు తెప్పించే పాత్ర ఏదన్నా ఉంది అంటే, ఆలీ గారి పాత్రనే. ఆయన ఎందుకని ఆ పాత్ర చేసారో ఆయనకైనా తెలిస్తే బాగుండు. సినిమా ని సగం నీరశించేలా చేసింది ఆ పాత్రనే. షిండే, మార్కండే వాళ్ళ పరిధిలో పాత్రలకు న్యాయం చేసారు. కావ్య గారి అందాలు, రామ్ గారి పొగరు, సంజయ్ గారి విలనిజం ఇదే సినిమా అంతా ఉంటుంది.

సాంకేతిక విభాగం:

మొదట మెచ్చుకోవలసింది పోరాట దర్శకులని. వాళ్ళు ఇద్దరు ఇచ్చిన పోరాటాలు కొంచెం కాపాడాయి సినిమాని, అది కూడా కొంచెం సేపటివరుకు మాత్రమే. సినిమాటోగ్రఫీ బాగుంది, మణిశర్మ గారి బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రెండు పాటలు అలరిస్తాయి. డాన్స్ కూడా ఎప్పుడూ రామ్ గారు వేసిన స్టెప్స్ ఏ మళ్ళీ మళ్ళీ వెయ్యటం చూస్తాం. కానీ ఎనర్జీ ఉంటుంది డాన్స్ లో. అసలు సరిగ్గా లేనిది కథ, దర్శకత్వం. తన సొంత బ్యానర్ మీద సినిమా తెస్తున్నాను అనే ఆలోచన పూరి గారికి ఉందోలేదో తేలేదు కానీ, నిజంగా ఆయన ఆ ఆలోచనతో ఉంటే మాత్రం ఈ చిత్రాన్ని ఇలా తెరకెక్కించరు. నిర్మాణ విలువలు కనిపిస్తున్నప్పటికీ, అంత పెట్టింది ఇంతోటి దానికా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా మంచిగానే ఉంటుంది ఈ చిత్రానికి.

ప్లస్ పాయింట్స్:

పోరాటాలు, రెండు పాటలు, అమ్మ సెంటిమెంట్

మైనస్ పాయింట్స్:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆలీ గారి పాత్ర

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page