ఎప్పటినుంచో సినిమాలు విడుదల అవ్వక థియేటర్స్ వెలవెల పోతుంటే ఆడుకోటానికి ముందుకొచ్చారు విశ్వక్సేన్, కార్తికేయ లాంటి కుర్ర హీరోలు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి వాళ్ళ సినిమాలకి. ముఖ్యంగా కార్తికేయ “భజే వాయు వేగం” చిత్రానికి మంచి ఆదరణ లభించింది . మొత్తానికి నెమ్మదినెద్దిగా థియేటర్స్ మళ్ళీ పునర్వైభవం పొందుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇంకా పూర్వ వైభవం రావాలంటే పెద్ద తారల చిత్రాలు విడుదల అవ్వాలి. ఈ జూన్ 27న ప్రభాస్ కల్కి విడుదలకి సిద్ధంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ సంవత్సరం చాలానే పెద్ద చిత్రాలు ఉన్నాయి. ఆ సంబరాలకు కల్కి నాంది పలకగా మిగిలినవి అన్నీ ఒక్కో నెల వ్యవధిలో విడుదల అవ్వబోతున్నాయి. కాకపోతే ఇద్దరు హీరోల ఫాన్స్ కి మాత్రం ఈ సంవత్సరం కొంత బాధాకరమని చెప్పాలి. గతేడాది “బ్రో” చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం అయిన “OG” కోసం ఎంతో ఆశగా అందరూ ఎదురుచూస్తున్నారు. లెక్క ప్రకారం సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల అవ్వాలి. ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో గెలుపొంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర రాజకీయాలలో కొంచెం బిజీగా ఉండటం వలన బహుశా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. తమ ఆరాధ్య నటుడు ఎన్నికలలో గెలిచాడు అనే ఆనందంతో ఈ సంవత్సరం గడపలేమో పవన్ ఫాన్స్. రెండొవ నటుడు బన్నీ. అల్లు అర్జున్ నుంచి రాబోతున్న చిత్రం “పుష్ప ది రూల్” లెక్కప్రకారం ఆగష్టు 15న విడుదల అవ్వాలి . కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ చిత్రం కూడా పోస్టుపోన్ అయ్యింది. ఇప్పటికే 3 సంవత్సరాలు అయ్యింది మొదటి భాగం విడుదల అయ్యి. ఇప్పటికైనా విడుదల అవుతోంది అనే సంతోషం ఆవిరయిపోయింది.
ఇప్పుడు ఈ రెండు చిత్రాల విడుదల తేదీని వేరే రెండు పెద్ద చిత్రాలు ఉపయోగించుకుంటున్నాయి. అక్టోబర్ లో విడుదల అవ్వాల్సిన ఎన్టీఆర్ చిత్రం దేవర, OG చిత్రం విడుదల తేదీని ఉపయోగించుకుంటోంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది. రెండు వారాల ముందుకి విడుదల తేదీ రావటంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప విడుదల తేదీ అయిన ఆగష్టు 15ని పూరి -రామ్ కలయికతో వస్తున్న డబల్ ఇస్మార్ట్ యూనిట్ ఉప్పయోగించుకుంటున్నారు. ఇప్పటికే విడుదల తేదీలని ఆ చిత్ర బృందం ఖరారు చేసారు. తారక్, రామ్ ఫాన్స్ కి పండగ వాతావరణం నెలకొనగా, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ అభిమానులకి మాత్రం ఈసారి ఆ అవకాశం లేకపోయింది. అక్టోబర్ లో విడుదలకి ఎలాంటి పెద్ద చిత్రాలు లేకపోవటంతో ఆ నెలని ఏమన్నా ఉపయోగించుకుంటారేమో వేచి చూడాలి.
ఆర్టికల్ బై : సాయిరాం తాడేపల్లి