రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద స్టార్ పాత సూపర్ హిట్ సినిమా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మళ్ళీ విడుదల చేసారు. అలాంటి పద్దతి తెలుగు యువతకి కొత్త కాబట్టి మాస్ జాతర చేసారు థియేటర్ లో. సీట్లు చించేశారు, కొన్ని చోట్ల స్క్రీన్ కూడా పాడుచేసేసారు ఫాన్స్. కలెక్షన్స్ ని ఒక మంచి పనికోసం డొనేట్ చేసారు నిర్మాత కూడా. అప్పటినుంచి మొదలయ్యింది ప్రతీ స్టార్ హీరో పాత చిత్రాలు విడుదల అవుతూనే ఉన్నాయి. కొన్ని అయితే విడుదల అయినప్పుడు ప్లాప్ అయినవి తరువాత కల్ట్ క్లాసిక్ అనే బిరుదుని సొంతం చేసుకున్న చిత్రాలు కూడా మళ్లీ థియేటర్ లో సందడి చేసాయి. కాకపోతే ఈ కొత్త సంప్రదాయం మనకి అవసరమా అనే ఆలోచన నిర్మాతలు కూడా ఒకసారి ఆలోచించితే మంచిది అనిపిస్తోంది. ఇప్పుడు లిస్ట్ లో పెద్ద పెద్ద చిత్రాలు విడుదల ఉన్నాయి, వాటికోసం థియేటర్లు అన్నీ ముస్తాబు అవుతున్నాయి. ఈ సమయంలో పాత చిత్రాలని విడుదల చేసి ఏమన్నా థియేటర్లకి ఇబ్బంది అయితే చాలా నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఒక పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చెయ్యటం అనే సంప్రదాయాన్ని పక్కకు నెట్టి ఇష్టంవచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ చిత్రం పడితే అది విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని కొన్ని వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు కూడాను. వేచి చూడాలి మరి, ఈ ఉపయోగం లేని సంప్రదాయం ఎప్పుడు ఆగుతుందో.