- Advertisement -spot_img
HomeReviewsసూర్య "కంగువా" రివ్యూ: Suriya "Kanguva" review - FilmCombat

సూర్య “కంగువా” రివ్యూ: Suriya “Kanguva” review – FilmCombat

- Advertisement -spot_img

రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి

విడుదల తేదీ: నవంబర్ 14, 2024
చిత్రం: “కంగువా”
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “The war between love and trust beyond the ages.”
నటీనటులు: సూర్య, దిశా పఠాని, బాబీ డియోల్, యోగి బాబు, రెడిన్, కె.ఎస్. రవికుమార్, కోవై సరళ తదితరులు.

ఎడిటర్: నిశద్ యూసుఫ్
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి
ప్రొడక్షన్: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్
కథ: శివ, ఆది నారాయణ
పోరాటాలు: సుప్రీమ్ సుందర్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
రచన-దర్శకత్వం: శివ

దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత హీరో సూర్య వెండితెరమీద ప్రత్యక్షం అవ్వబోతున్నారు. గత రెండు చిత్రాలు డైరెక్ట్ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ లో విడుదల అవ్వటంతో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న చిత్రం “కంగువా” విడుదల అయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్. అంతే బాధ్యతతో దర్శకత్వం చేసారు శివ. ఈ చిత్రం శివ గారికి, సూర్య గారికి చాలా ముఖ్యమైనది. అందాల భామ దిశా పఠాని సూర్య గారి సరసన నటించారు, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. రెండు వేరువేరు కాలమానాలలో జరిగే ఈ కథ ఎలా ఉంది? కంగువా ఎవరు? ఎలాంటి యోధుడు? మంచివాడా లేక భయంకరమైన రాక్షసుడా ? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి ప్రేక్షకులకి. అలాంటి ప్రశ్నలకి సమాధానమే ఈ రివ్యూ.

కథ:

ప్రస్తుత కాలమానంలో ఫ్రాన్సిస్ (సూర్య), తన ప్రియురాలు ఏంజెల్ (దిశా పఠాని) విడిపోతారు. కానీ వాళ్ళు ఇద్దరు బౌంటీ హంటర్స్. డబ్బుకోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఒక టాస్క్ లో ఫ్రాన్సిస్ (సూర్య) అనుకోని చిక్కుల్లో పడతాడు. ఆ టాస్క్ చేస్తూండగా ఫ్రాన్సిస్ ని, బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ పేషెంట్ ఒక చిన్న పిల్లవాడు (జెటా) చేసేస్తాడు. తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఫ్రాన్సిస్ కి తనకి ఏదో విడదీయలేనటువంటి సంబంధం ఉంది అనిపిస్తుంది. అనుకోకుండా ఆ బాబుని కాపాడే క్రమంలో ఇంకొక కాలమానం లోకి కథ వెళుతుంది. ఆ రెండు కాలమానాలకి ఉన్న సంబంధం పాత్రలకి ముడిపడి ఉంటుంది. రెండొవ కాలమానంలో (11వ శతాబ్దం) ఒక అయిదు తెగలు (ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన) మధ్య ఒక వైరం మొదలవుతుంది. ప్రణవాది కోనకి చెందిన రాజు కొడుకు కంగువా(సూర్య), కపాల కోనని ఎదురుకోవలసి వస్తుంది. ఆ కోన నియంత రుధిర నేత్ర (బాబీ డియోల్) తో తలపడి గెలిచాడా, ఓడిపోయాడా అనేది మిగిలిన కథ. అరణ్య కోనకి చెందిన పిల్లవాడికి, జెటా పిల్లవాడికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చివర్లో వచ్చే ట్విస్ట్ రెండొవ అధ్యాయానికి నాంది పలికింది.

కథనం:

ప్రస్తుత కాలమానంతో మొదలయ్యి, అసలు సంబంధం లేని విధంగా రెండొవ కాలమానం మొదలవుతుంది. అలా మొదలు పెట్టటానికి కూడా కారణం చివర్లో తెలియచేసారు దర్శకులు. ఒక బౌంటీ హంటర్ గా ఉన్న ఇద్దరి ప్రేమికుల ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి దొరుకుతాడు. అతను ఒక పెద్ద మాఫియా ముఠా ఒక ఎక్సపెరిమెంట్ కోసం ఉపయోగించుకుంటున్న పేషెంట్. అతన్ని కాపాడటానికి ఫ్రాన్సిస్ పోరాటం మొదలు పెడతాడు. ప్రస్తుత కాలం కథనుంచి కాలాలు దాటి దాదాపుగా పది శతాబ్దాల వెనక్కి వెళుతుంది కథ. అయిదు కోనలు (పంచకోనలు) ఒకే చోట ఉంటాయి. ఎంచుకున్న ప్రతీ కోనకి ఒక కథ, కారణం బాగా చూపించారు దర్శకులు. వేషధారణలో, ఆయుధాలలో, అలవాట్లలో తేడాలు మంచిగా చూపించారు. దేశాన్ని ఆక్రమించుకోటానికి వచ్చిన బయట దేశపు (రోమన్) యుద్ధ సైనికులు, ఒక తెగకి సంబంధించిన వ్యక్తులతో కలిసి కంగువా తెగ అయిన ప్రణవాది కోనని అంతం చెయ్యాలనుకుంటారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో విభేదం ఉన్న కపాల కోనతో యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం చాలా ప్రాణాలని బలికోరుతుంది.

రెండొవ భాగంలో బాగా ఆకట్టుకున్నది చీకటి పర్వతం మీద కంగువా జరిపిన యుద్ధం. ఎలాంటి సైనిక సలహా సహాయం లేకుండా ఒక్కడే పోరాడుతాడు. హిమ కోనమీద ఆడవాళ్ళు చేసిన పోరాటసన్నివేశాలు అయితే వెంట్రుకలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ప్రతీ పోరాట సన్నివేశం అద్భుతంగా ఉంది. ప్రతీ కోనకు ఒక సాంప్రదాయం, పద్ధతులు, తెగింపు, బాధ్యత, ధైర్యం, తెగువు అన్నీ చాలా మెలకువతో చూపించారు దర్శకులు. క్లైమాక్స్ లో అందరినీ అబ్బురపరిచే ఒక ట్విస్ట్ దాగి ఉంది. అది చుస్తే కానీ ఆ అద్భుతాన్ని ఆస్వాదించలేరు. క్లైమాక్స్ పోరాటసన్నివేశాలు, షిప్ ఫైట్, కార్గో ప్లేన్ ఫైట్ సమాంతరంగా చూపించే ప్రయత్నం అయితే చేసారు.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య ఒదిగిపోయారు. ముఖ్యంగా మెచ్చుకోవలసింది కంగువా పాత్ర. ప్రాణం పెట్టి పోషించారు. ఒక విరోచిత యోధుడు, తన జాతిని, వాళ్ళు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, తనకున్న బాధ్యతని, ఎప్పటినుంచో ఉన్న విభేదాలని అన్నిటిని చూపించే ప్రయత్నాన్ని తన భుజాలమీద మోశారు. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రకి అర్హులు కారు. ఒక మొండిఘటానికి తాత్పర్యం గా ఉన్నారు సూర్య. హీరోయిన్ కి అంతగా స్కోప్ లేకపోయినప్పటికీ తన అందచెందాలతో మరిపించారు దిశా. కామెడీ కోసం జతచేర్చబడిన పాత్రలు యోగి బాబు, రెడిన్ కొంతవరకు ప్రయత్నం చేసారు. ముఖ్యంగా చెప్పుకోవలసిన ఇంకో పాత్ర బాబీ డియోల్. మొదటిసారి తమిళంలో నటిస్తున్నప్పటికీ, ఒక తెగకి సంబందించిన పెద్ద పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఆయన బలం, బలగం, వాలకం, వ్యవహారం వింతగా ఉంటాయి. క్రూరత్వానికి తగిన వారసుడు అనిపించేలా చేసారు నటన. చివర్లో వచ్చే ఒక స్పెషల్ పాత్రకి థియేటర్ దద్దరిల్లుతుంది. ఆ పాత్రకి ప్రాణంపోసే బాధ్యత, తరువాతి భాగానికి నాంది ఆయనే పోస్తారు. అదేంటో తెరమీద చూడాల్సిందే. చివర్లో వచ్చే పాత్ర, చిత్రం మొదటినుంచి కనపడని ఒక ముఖం. అది తెరమీద చూస్తేనే బాగుంటుంది మరి.

సాంకేతిక విభాగం:

మొదటగా చెప్పుకోవలసింది దేవి శ్రీ ప్రసాద్. పాటల గురించి పక్కన పెడితే, బాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రతీ కోనకి సంబంధించి వేరే వేరే మ్యూజిక్ ఇచ్చారు. జంతువుల శబ్దాలు, కోన ప్రజలు చేసే వింత శబ్దాలు చాలా చక్కగా ఇచ్చారు. మెచ్చుకోదగ్గ వాళ్ళల్లో రెండొవ పేరు సినిమాటోగ్రఫీ. వెట్రి పళనిసామి ఆయన లేకపోతే ఇంకా ఈ చిత్రం వృధా అన్నట్టు ఇచ్చారు ఫ్రేమ్స్. ఎలివేషన్ ఫ్రేమ్స్ అయితే మాటలకు అతీతం. ఎడిటర్ స్వర్గీయులు నిశద్ యూసుఫ్ ఏ లోకంలో ఉన్నారోకాని ఈ చిత్రంలో తన పనితనం చూసి అందరు ఆయన్ని మెచ్చుకుంటారు. కథ మంచిగా రాసుకున్నారు శివ, ఆది నారాయణ గారు. గత చిత్రం నుంచి నేర్చుకున్న అనుభవాలని రంగరించి జాగ్రత్తగానే తెరకెక్కించారు శివ. సూర్య, కథ, బాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ చిత్రంలో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్. స్క్రీన్ ప్లే, భయంకరమైన అరుపులు, గ్రాఫిక్స్ (లాంగ్ షాట్) ఈ చిత్రంలోని ముఖ్యమైన నెగిటివ్ అంశాలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page