ఒక సినిమా అనుకున్నట్టుగా ఆడితే ఆ టీం కొనసాగింపు తీసే ఆలోచనలు చెయ్యటం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. అదే కోవలోకి వచ్చిన చిత్రం తాజాగా విడుదల అయ్యి అందరి మన్నలను పొందిన కామెడీ చిత్రం “మాడ్”. నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , రామ్ నితిన్ కథా నాయకులుగా చెయ్యగా , వాళ్ళకి జోడీగా గౌరీ ప్రియా , అనంతిక , గోపికా ఉద్యాన నటించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ తన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా సమర్పించారు , కళ్యాణ్ శంకర్ దర్శకత్వం చేసారు. చిత్రం విడుదల అయినప్పటినుంచి మంచి టాక్ తో దూసుకుపోయింది అలానే మంచి వసూళ్ళని రాబట్టింది. ఈ చిత్రంలో నటించిన అందరు నటులు ప్రశంసల వర్షాన్ని అందుకున్నారు . ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపు రాబోతోంది. ఏ యూనిట్ తో అయితే విజయం లభించిందో అదే యూనిట్ తో మొదటి భాగానికి కొనసాగింపు చిత్రం నిర్మిస్తున్నారు. మెచ్చుకోతగ్గ విషయం ఏమిటి అంటే, మొదటి భాగం విడుదల అయిన అక్టోబర్ 6న రెండొవ భాగం విడుదల చేస్తున్నారు.
మొదటి భాగంలో ప్రేమ , స్నేహం అంశాలని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కళాశాల విలువ, అక్కడ ప్రతీ ఒక్క విద్యార్థికి దొరికే స్నేహం , ఆటలు , గొడవలు, కాలేజ్ ఈవెంట్స్ ఇలాంటి అంశాలని హాస్యపూర్వకంగా చాలా బాగా చూపించారు. భీమ్స్ అందించిన అన్నీ పాటలు అన్ని వర్గాల వారికీ నచ్చాయి. ముఖ్యంగా “కాలేజ్ పాప” పాట ఆన్లైన్ లో మోతమోగిపోతోంది. ఇప్పుడే అదే తారాగణంతో , అదే టెక్నికల్ టీం తో మళ్ళీ అదే బ్యానర్ లో కొనసాగింపు రావటం ప్రశంసనీయం. విడుదలకి ఇంకా 9 నెలలు ఉన్నపటికీ , మొదటి భాగాన్ని బాగా ఇష్టపడిన సినిమా ప్రియులు , ఈ తదుపరి భాగం కోసం అతృతతో ఎదురు చూస్తున్నారు.