తన విభిన్న నటనా చాతుర్యంతో అభిమానులని కట్టి పడేసే నటుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి గారు. కొన్ని డైరెక్ట్ తెలుగు చిత్రాలు చేసిన ఆయనకి తెలుగులో కూడా మంచి గుర్తింపు, మార్కెట్ ఉంది. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 చిత్రం ద్వారా మన ముందుకు వచ్చారు మమ్మూట్టి గారు. అది ఆయన ఇదివరకు నటించిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన “యాత్ర” కి కొనసాగింపు. ఏడు పదుల వయసులోకూడా తన విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి విభిన్నమైన కథాంశంతో మన ముందుకు ఫిబ్రవరి 15వ తేదీన “భ్రమయుగం” అనే చిత్రం ద్వారా మన ముందుకు వస్తున్నారు. YNOT స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్ ద్వారా రామచంద్ర చక్రవర్తి , ఎస్. శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు విడుదల అయ్యి సోషల్ మీడియా వేదికగా చర్చనీయ అంశం అయ్యింది. మమ్మూటీ గారు, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన తారాగణంతో రాహుల్ సదాశివం రచింది దర్శకత్వం చేసిన చిత్రం “భ్రమయుగం”.
పాచికల ఆటతో మొదలైన ఈ చిత్రం ట్రైలర్, మొత్తం చివరిదాకా ఓకే ఒక్క డైలాగ్ తో నడుస్తుంది. షెహనాద్ అందించిన సీనమెటోగ్రఫీ అద్భుతంగా ఉంది. లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. మమ్మూట్టి గారి వేషధారణ కొత్తగా ఉంది. ఇదివరకు ఆయనని ఇలాంటి విధంగా చూడలేదు ఎవ్వరూ. క్రిస్టో ఇచ్చిన మ్యూజిక్ కూడా సన్నివేశాన్ని ఇంకా ఉత్తేజపరిచే విధంగా ఉన్నది. ట్రైలర్ ని బట్టి ఇది ఖర్మానుసారం జరిగే ఒక పరిణామానికి సంబందించిన చిత్రంలాగా అనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం మీద ఒక నలుగురు మాత్రమే కనిపించారు. పాచికల ఆటతోనే ఈ చిత్రం ముడిపడి ఉన్నట్టు తెలుస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. వేసే రెండు పాచికలు ఇద్దరు వ్యక్తులని సూచిస్తోంది, పఠము జీవితానికి సంబందించినదిగా గోచరిస్తోంది. చాలా విభిన్నమైన కథాంశంతో ఫిబ్రవరి 15వ తేదీన మన ముందుకి రాబోతున్న ఈ చిత్రం ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.