యాత్ర-2 కి పోటీగా “రాజధాని ఫైల్స్” ఈ నెల 15న రాబోతుంది. యాత్ర-2లో వై.యస్.జగన్ ని హీరోగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విలన్స్ గా చుపిస్తే, రాజధాని ఫైల్స్ లో వై.యస్.జగన్ ని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. 2019 ఎలెక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. దానితో పాటుగా వై.స్.జగన్ పై జరిగిన కోడికత్తి దాడి, వై.స్.వివేకానందరెడ్డి మర్డర్ లాంటి వివాదాకరమైన అంశాలను కూడా టచ్ చేసారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసారు చిత్రయూనిట్.
అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ ఏ.పి.మూడు రాజాధానుల విషయం గురించి అడగగా దాని పై ఈ చిత్ర దర్శకుడు “భాను” స్పందించారు. ఏ.పి రాజధాని అమరావతి కోసం రైతులు ౩౩వేల ఎకరాలు ఉచితంగా ఇచ్చారని ఇప్పుడు రాజధాని మారిస్తే అమరావతి రైతులు నష్టపోతారని వాళ్ళకి మద్దతుగా మేము ఈ సినిమా తీశామని ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని చెప్తూ, ప్రతి కుటుంబానికి ముగ్గురు అమ్మలుంటే ఏంటి? ముగ్గురు నాన్నలుంటే ఏంటి? ముగ్గురు నాన్నలుంటే ఏ నాన్న దగ్గరకు వెళ్లాలో, ముగ్గురు అమ్మలుంటే ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలీదు మనకి! అలాగే, మూడు రాజధానులు ఉంటే అదే దుస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేస్తూ సవాలు విసిరారు.