వైవా హర్ష అంటే తెలియని తెలుగు సినీ ప్రేమికుడు లేడు. తను నటించిన ప్రతీ పాత్రలో జీవించి ఆ పాత్రకి న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా మొదటి అడుగు వెయ్యబోతున్నారు “సుందరం మాస్టర్” చిత్రం ద్వారా. ఈయనకి జోడిగా యూట్యూబ్ సెన్సేషన్, కొన్ని ప్రఖ్యాత చిత్రాలలో కూడా సైడ్ ఆర్టిస్ట్ గా నటించిన ‘దివ్యా శ్రీపాద’ నటిస్తున్నారు. షాలిని నంబు, శ్వేతా కలిదిండి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ రాజా రవితేజా “RT టీం వర్క్స్” ద్వారా నిర్మిస్తున్నారు. ఆయనతోపాటుగా సుధీర్ కుమార్ కుర్రా తన గోల్డెన్ మీడియా ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో రవితేజా కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వటంలో ఎప్పుడూ వెనుకాడరు అని మరొకసారి నిరూపించారు. ఈ చిత్రం ట్రైలర్ కి అందరి నోటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది ఒక పల్లెటూరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే కామెడీ, థ్రిల్లర్ చిత్రం.
సుందరం మాస్టార్ పాత్రలో హర్షా గారు ఓదిగిపోయారు. ట్రైలర్లో ఆయన పండించిన కామెడీ అమోఘం. ముఖ్యంగా ప్రస్తావించాల్సింది దివ్య శ్రీపాద గురించి పద్దతి, అణుకువ, తనదైన అంద చందాలతో ట్రైలర్లో అందరినీ అలరించారు. ఈ ఇద్దరూ ఇదివరకు కలర్ ఫొటో అనే చిత్రంలో హీరో హిరోయిన్ లకు స్నేహితులుగా నటించారు. అలాంటి పాత్రలు చేసిన వీళ్ళ ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్ గా చెయ్యటం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ పరంగా దివ్య గారు ఒక అటవీ ప్రాంతంలో, ఒక గూడెంలో ఉండే వ్యక్తి. అక్కడికి సుందరం మాస్టర్ గా ‘హర్షా’ ఇంగ్లీష్ నేర్పించటానికి వస్తారు. కానీ అక్కడకు ఆయన్ని పంపటానికి ముఖ్య కారణం ఆ గూడెం వాళ్ళకి నలుపుగా ఉండే వ్యక్తులు అంటే అమితమైన ప్రేమ, గౌరవం. ఒక ముఖ్యమైన పని కోసం తనని అక్కడకి పంపటం జరుగుతుంది. అక్కడకి వెళ్ళాక తాను చుసిన సన్నివేశాలు, అనుభవించిన వింతైన ఆచారాలు, తన అనుభవాల చుట్టూ తిరుగుతుంది కథ.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన సంగీతం వినసొంపుగా ఉంది, అన్ని వర్గాలవారిని అలరిస్తాయనటంలో అతిశయోక్తి లేదు. దీపక్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అటవీ ప్రాంత సన్నివేశాలు కచ్చితంగా నవ్వులు పూయిస్తాయి. దివ్య గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. యూట్యూబ్ నుంచి ఎదిగి, తన నటనతో అందరినీ మెప్పించి, చాలా చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తన ప్రతిభకి తగ్గ పాత్ర లభించింది ఇన్నాళ్ళకి. ఒక గూడెం పిల్లలాగా అందంగా, అనుకువగా, అమాయకంగా చాలా బాగున్నారు ఆవిడ. ఖచ్చితంగా కథకి సంబందించిన పాత్రలోనే నటించారు అని తెలుస్తోంది ట్రైలర్ ద్వారా. ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు తలుపు తడుతుంది అనటంలో నిజం లేకపోలేదు. ఈ విషయం దివ్య గారిని చుస్తే తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ఆవిడకి వచ్చిన సువర్ణ అవకాశాన్ని నిలబెట్టుకుంటారని ఆశిద్దాం. మొదటిసారి హీరోగా చేస్తున్న హర్ష గారికి, తన ప్రతిభకి తగ్గ మంచి మంచి పాత్రలు ఇంకా రావాలని కోరుకుందాం. ఈ చిత్రం ఫిబ్రవరి 23వ తేదీన విడుదల అవ్వబోతోంది. ఈరోజు విడుదల అయిన ట్రైలర్ వల్లనే సినిమా కూడా అలరించాలని కోరుకుందాం.