బోర్డర్ లో ఉండే సైనికులమీద చిత్రాలు రావటం, వాళ్ళ కష్టాలు గురించి ప్రస్తావించటం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం చిత్రసీమలో. కానీ కొన్ని చిత్రాలు, ఊహ లోంచి రాసుకున్న కథలు అయితే, కొన్ని నిజముగా జరిగిన సంఘటల నడుమ కొంత కల్పిత పాత్రలతో అల్లిన అందమైన కథలు ఉన్నాయి. అలాంటి చిత్రమే వరుణ్ తేజ్ నటించిన “ఆపరేషన్ వాలెంటైన్”. పుల్వామా లో మన భారత సైనిక దళం మీద దాడి జరిపి 49 మంది ప్రాణాలు అమానుషంగా తీశారు పాకిస్తాన్ తీవ్రవాదులు. ఆ సంఘటనని ఆధారం గా చేసుకుని ఈ చిత్రం రూపొందించారు. ఇది ఒక భారత ఎయిర్ ఫోర్స్ కి సంబందించిన చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ విశేషాల గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం.
ఫైటర్ జెట్ పైలట్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. 2019 లో ఫిబ్రవరి 14న మన భారత సైనికుల వాన్ మీద దాడి జరిపి 49 మంది ప్రాణాలు తీశారు. అప్పుడు ప్రతీకారం తేర్చుకోటానికి ఎయిర్ ఫోర్స్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. మన సైనికుల మీద దాడి జరిపిన బృందం ఉన్న చోటు తెలుసుకుని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ దేశంలోకి వెళ్లి వాళ్ళని మట్టుపెట్టి రావాలి. వెనక్కి తిరిగి రాకపోవచ్చు కూడాను. ఇలాంటి మిషన్ కి నాయకుడు రుద్ర. ఎవ్వరి మాటా వినడు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. తనకి రాడార్ కమాండర్ (సోనాల్) గా బాలీవుడ్ భామ మనుషి చ్చిల్లర్ నటిస్తున్నారు. నవదీప్ (కబీర్ ) రుద్రాతో పాటుగా వింగ్ కమాండర్ గా నటిస్తున్నారు. రుహాణి శర్మ(తాన్యా శర్మ) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, మీర్ సర్వార్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ అంటే ఎప్పుడూ చూసే విధంగా కాదు. ఒక సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగం, తన తోటి సైనికుడికి జరిగిన ద్రోహానికి ప్రతీకారం, చెయ్యాల్సిన న్యాయం.
శక్తి ప్రతాప్ సింగ్ హడ తొలిసారి దర్శకత్వం చేస్తున్నారు. సోనీ పిక్చర్స్, Renaissance Pictures సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ అందించారు, దృశ్యరూపంలో ఆ పోరాట సన్నివేశాలు, ఎయిర్ స్ట్రైక్ సన్నివేశాలు చూస్తుంటే, నిజమైన పోరాట సన్నివేశాలు చూస్తున్నట్టు అనిపిస్తోంది, వెంట్రుకలు నిక్క పొడుచుకుంటున్నాయి. ఇలాంటి చిత్రానికి మ్యూజిక్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది, ప్రతీ సన్నివేశాన్ని తన సంగీత ప్రతిభతో ఉగ్వేగ పరిచేలా చేసారు మిక్కీ జె మేయర్ గారు. ట్రైలర్ మొత్తం పోరాట సన్నివేశాలతో నింపేశారు. ప్రతీ సీన్ చాలా అద్భుతంగా చూపించారు. మొదటి చిత్రం అయినా, దర్శకులు ఎక్కడా కూడా అలాంటి ఛాయలు లేకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులు చేసినట్టు చేసారు. ఈ చిత్రం మార్చ్ 1న మన ముందుకు రాబోతోంది. ఈ చిత్రం గురించి యావత్ భారతావని ఎదురుచూస్తోంది. ఈ చిత్రం తెలుగు ఇంకా హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు.