డిటెక్టివ్ మూవీస్ ఈ మధ్య ప్రాధాన్యతని పొందుతున్నాయి. చిన్న హీరోలు, కొత్త హీరోలు సైతం అలాంటి కథలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అలాంటి తరహా కథతోనే వస్తున్న చిత్రం “భూతద్దం భాస్కర్ నారాయణ”. శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బన్నేరుపై స్నేహాల్ , శశిధర్ , కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి చర్చనీయా అంశం అయ్యింది. ఎక్కడా కూడా కథని దాచకుండా ట్రైలర్లోనే ముఖ్యమైన ప్లాట్ ని బయటపెట్టారు అంటే, చిత్రం బృందం తెరకెక్కించిన తీరుమీద ఉన్న నమ్మకం అటువంటిది. ఇది ఒక డిటెక్టివ్ చిత్రం అయినప్పటికీ, నరబలి కథనంతో సాగే కథ. హీరో ఒక డిటెక్టివ్ ఒక కేసు విషయంలో తలమునకలై ఉంటాడు. అందరూ అనుకున్నట్టు ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అనుకుంటారు, కానీ హీరోనే ఇది నరబలి ప్రక్రియ అని కనిపెడతాడు. అసలు నరబలి ఎవరు ఇస్తున్నారు, ఎందుకు సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున 16 మంది ఆడపిల్లల తలా నరికేసి బలి ఇస్తున్నారు అనేది చిత్రం చూసి తెలుసుకోవలసిన విషయాలు. నిర్మాణ విలువలు బాగున్నాయి, స్క్రీన్ ప్లే మీదనే సినిమా అంతా నడుస్తుంది అని తెలిసిపోతోంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ రాసుకున్న కథ, ధైర్యంగా ముఖ్యమైన ప్లాట్ నే ట్రైలర్ లో చూపించారు అంటే, ఆయనకి తన రచనా విధానం మీద ఉన్న నమ్మకం అని తెలుస్తోంది. శ్రీచరణ్ పాకల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నది, ఆయనతో పాటుగా విజయ్ గారు కూడా సంగీత బాధ్యతలు చేపట్టారు. గౌతమ్ జి ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ అయితే అలరించింది అనే చెప్పొచ్చు, ఈ చిత్రం మార్చ్ 1న విడుదలకి సిద్ధంగా ఉంది. వేచి చూడాలి, ఇప్పటిదాకా వచ్చిన చేతబడి, నరబలి చిత్రాలకి ఈ చిత్రానికి ఉన్న తేడా ఏమిటో.