తమిళ నాట ఎంతటి ప్రాముఖ్యత పొందారో అంతే ప్రాముఖ్యతని తెలుగు సీమలో సొంతం చేసుకున్న హీరో సూర్య. ఆయన నుంచి ఈ మధ్య డైరెక్ట్ థియేటర్ చిత్రాలు రాలేదు. వచ్చిన OTT చిత్రాలు అలరించాయి. ఇప్పుడు సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం దర్శకుడు శివ దర్శకత్వంలో వస్తున్న “కంగువా”. స్టూడియో గ్రీన్ సంస్థ, యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇది ఒక ప్రాచీన కాల యుద్ధ నేపథ్యంలో ఒక తెగకి సంబందించిన కథ, కథనం. ఈ రోజు కంగువా బృందం అదిరిపోయే టీజర్ ని వదిలింది. అదే “కంగువా సిజిల్ టీజర్”. ఇప్పటిదాకా సూర్య గారిని ఎన్నడూ చూడని అవతారంలో చూపించారు దర్శకుడు శివ. శివ ఎక్కువగా యాక్షన్ ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన చిత్రాలు తీస్తుంటారు. మొదటిసారి ఆయన పరిది దాటి వచ్చి చేస్తున్న చిత్రం. ఒక భయంకరమైన యోధుడిగా సూర్య గారిని చూపించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో దిశా పఠాని నాయికగా చేస్తున్నారు. మొదటిసారి వీళ్ళు ఇరువురూ తమిళంలో నటిస్తున్నారు. దిశా గారు ఇదివరకు వరుణ్ తేజ్ తో కలిసి తెలుగు చిత్రంలో నటించారు, బాబీ డియోల్ గారు నందమూరి నటసింహం బాలక్రిష్ణ గారి తదుపరి చిత్రంలో చేస్తూ తెలుగులో పరిచయం అవ్వబోతున్నారు. ఇంత మంచి స్టార్ బృందం ఏర్పరుచుకుని శివ గారు చాలా గట్టిగానే ప్లాన్ చేసారు అనిపించింది టీజర్ చూసాక. మొత్తం టీజర్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. సూర్య గారిని , బాబీ గారికి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు, బాబీ గారి వేషధారణ అద్వితీయం. గ్రాఫిక్స్ , టేకింగ్ , గెటప్ అన్ని విషయాలలో అమోఘమైన పనితీరుని ప్రదర్శించింది బృందం. మొసలి కన్ను గ్రాఫిక్స్, వార్ గ్రాఫిక్స్ కి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. DSP సంగీతం సమకూరుస్తున్నారు, ఆయనే ఎప్పుడూ శివ గారి చిత్రాలకి అందిస్తారు, కొన్ని మినహాయించి. వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ కి నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనిపించింది. ఎడిటర్ నిషద్ యూసుఫ్, కాస్ట్యూమ్స్ రాజన్ బృందం పనితీరుని తప్పకుండా మెచ్చుకోవాలి. ముఖ్యంగా సెరీనా (మేకప్ – సూర్య), కుప్పుసామి మేకప్ పనితనంకి ప్రపంచ స్థాయి గుర్తింపు కచ్చితంగా వస్తుంది. వేసవి సెలవలని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల అవ్వబోతోంది. వేచి చూద్దాం, శివ సూర్య గారి కాంబినేషన్ ఎలా వర్క్ అవుతుందో.