చిత్రం : ది ఫ్యామిలీ స్టార్
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్: బంధాలు, బాధ్యతల నడుమ నలిగే ఒక నికార్సైన ఫ్యామిలీ స్టార్ ప్రయాణం.
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం: గోపి సుందర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రాఫర్: కె. యు. మోహనన్
ప్రొడ్యూసర్: దిల్ రాజు – శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
దర్శకుడు: పరశురామ్
విడుదల: 05 ఏప్రిల్ 2024
అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ముద్దుగా రౌడీ బాయ్ అని పిలుచుకునే విజయ్ కి గీతా గోవిందం తరువాత ఆ స్థాయి గెలుపు తలుపు తట్టలేదు. తనకి మంచి విజయాన్ని అందించిన దర్శకుడు పరశురామ్ తో మళ్ళీ రెండోసారి కలిసి పనిచేసారు, అదే “ది ఫ్యామిలీ స్టార్” చిత్రం. అందాల సీత మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ జతగా నటిస్తుండగా, జగపతి బాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించగా, దిల్ రాజు-శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ఒక మంచి కుటుంబ కథాంశం తో రాబోతోంది. ఈరోజు విడుదల అయిన ఈ చిత్రం యొక్క విశేషాలు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం.
కథ:
గోవర్ధన్ (విజయ్) అనే ఒక మధ్య తరగతి కుర్రాడు, వయసుకు మించిన కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తాడు. కుటుంబానికి ఎలాంటి సమస్యా రాకుండా, తనకు సొంతం అనుకున్న ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కంటికి రెప్ప వలె కాపాడుకుంటూ ఉంటాడు. తన సొంత జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబంకోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. కుటుంబమే తన జీవితం లాగా బ్రతికే అతని లైఫ్ లోకి అనుకోకుండా ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. తన రాకవలన తన కుటుంబంలో జరిగే మార్పులు, తన జీవితంలో జరిగే సంఘటనలతో ఒక దశలో కలత చెందిన గోవర్థన్ ఎలాంటి ఒడిడుకులు ఎదురుకుంటాడు? అసలు ఇందు, గోవర్థన్ ని ఎందుకు కలిసింది? ఇద్దరి ప్రేమ కథ ముందుకు వెళ్లిందా? ఇందుకీ గోవర్థన్ కుటుంబానికి సంబంధం ఏమిటి? వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏమిటి? ఇవన్నీ తెలియాలి అంటే “ది ఫ్యామిలీ స్టార్” ని ఒకసారి థియేటర్ లో కలవాల్సిందే.
విశ్లేషణ:
మొదట కుటుంబ సభ్యుల పరిచయంతో మొదలయ్యే సినిమా అంచలంచలుగా, ప్రతీ కుటుంబంలో ఉండే చిన్న చిన్న అపార్థాలతో ముందుకు సాగుతుంది. గోవర్థన్ గా విజయ్ దేవరకొండ జీవించారు. ఆ పాత్రలో తన సొంత తండ్రిని ఊహించుకున్నారు అనిపించింది ఆయన నటన చూసాక. కుటుంబ బాధ్యతలు స్వీకరించిన ప్రతీ కుర్రాడు గోవర్ధన్ పాత్రకు కనెక్ట్ అవుతారు, అవ్వాలి కూడాను. ఎంత గొప్ప రాజు అయినప్పటికీ రాణి లేకపోతే ఆ జీవితానికి పరమార్థం ఉండదు అని నిరూపించారు మృణాల్. ఇందు పాత్రలో ఆవిడ ఒదిగిపోయి నటించిన విధానం కన్నులని చెమ్మగిల్లేలా చేస్తాయి. ప్రతీ సన్నివేశంలో కుటుంబం మీద అమితమైన ప్రేమని తుఫాను వర్షపు జల్లు వలెనే చూపించే విధంగా కథని, స్క్రీన్ ప్లే ని రాసుకున్నారు దర్శకులు. ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం అయితే ఈ చిత్రానికి ఒక ముఖ్యమైన పిల్లర్. కథ అక్కడినుంచే వేరే మలుపు తిరిగేలా తీర్చిదిద్దారు.
రెండొవ భాగంలో అదే ప్రేమానురాగాలని, భాధ్యతల్ని చూపిస్తూ, దానికోసం గోవర్ధన్ పడే శ్రమ మరపురాని విధంగా తీర్చిదిద్దారు. ప్రతీ మధ్యతరగతి అబ్బాయి గోవర్ధన్ లో తనని తాను ఊహించుకోకుండా మానరు. ఇందు పాత్రకి రెండొవ భాగంలో మంచి స్కోప్ ఉంచారు దర్శకులు. కొంచం పాతకాలం కథాంశంగా గోచరించినప్పటికీ ఆ ఎమోషన్స్ తో వీక్షకులని కట్టిపడేసే విధంగా నటీనటులు తమ ప్రతిభను కనపరిచారు. క్లైమాక్స్ లో కొంచెం అనుకోని సంఘటనలను చూపించిన విధానంతో కొంత మేరకు ఆకట్టుకున్నారు దర్శకులు.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
గోవర్థన్ గా ఇంకెవ్వరినీ ఊహించుకోటానికి వీలులేకుండా ఆ పాత్రని రక్తికట్టించారు విజయ్ గారు. ఒక కుటుంబ పెద్దగా ఉన్న బాధ్యతలని, తన జీవితాన్ని, ఆనందాలను ఎలాంటి సంకోచంకూడా లేకుండా కుటుంబం కోసమే ధారపోసి ఒక వ్యక్తిగా ఆయన జీవించారు. మృణాల్ పాత్రలో వైవిధ్యత ప్రతీ సన్నివేశానికి మారుతుంది. తను ఒక పక్కింటి తెలుగు ఆడపడుచులాగా అందంతో, అభినయంతో అలరించారు. కొంతవరకు కామెడీ విజయ్ గారు సీనియర్ నటి అయిన రోహిణీ గారితోనే చేసారు. రోహిణి గారు తనకు బామ్మగారిలా నటించారు. వాసుకి గారు, అభినయ గారు వదినలు పాత్రలలో మెప్పించారు, చిన్న పిల్లలు కూడా బాగా నటించారు. జగపతి బాబు గారు, వెన్నెల కిషోర్ గారు ఉన్న తక్కువ సమయంలోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. సఫలం అయ్యారు కూడాను. పాత్రల పరంగా ఎక్కువ మంది లేకపోయినప్పటికీ ఉన్నదానితో మంచిగా చిత్రీకరించారు. కొంతమంది యూట్యూబ్ తారల్ని ఈ చిత్రంలో చూస్తాము. వాళ్ళ పాత్ర ఉన్న కాసేపు తమ నటనా ప్రభావం చూపించే ప్రయత్నం చేసారు.
సాంకేతిక విభాగం:
గోపి సుందర్ అందరించిన పాటలు ఒక మోస్తాదుగా ఆకట్టుకున్నాయి. కళ్యాణి వచ్చా వచ్చా పాటకోసం అందరూ ఆత్రంగా ఎదురు చూసారు. ఆ పాట మంచిగా అలరిస్తోంది ప్రేక్షకులని. హీరోకి ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటర్ మార్తాండ్ గారి పని తనం గుయించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆయన శైలిలో చిత్రాన్ని ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫైట్స్ ఉన్నవి కొన్నే అయినా కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. మాటల రచయిత పనితనం కూడా మెచ్చుకోతగ్గ విషయం. ఎంతో గొప్పగా తీర్చి దిద్దే ప్రయత్నం అయితే చేసారు దర్శకులు. దర్శకుడు పరశురామ్ కి కుటుంబం మీద ఉన్న ప్రేమ ఆప్యాయత ఈ చిత్రం ద్వారా చూపించారు.
ఓవరాల్: మంచి కుటుంబ కథా చిత్రం. కచ్చితంగా మీకు కూడా ఒక విధమైన మధురానుభూతి కలుగుతుంది.
రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి