“పార్వతీశం” ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ కేరింత సినిమాలోని “నూకరాజు” పేరు చెప్తే టక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది బ్యాగ్రౌండ్ లేని నటులొచ్చారు. వారిలో కొంతమంది బాగా సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగైపోతారు. అలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పార్వతీశం కూడా ఒకరు. నిజానికి పార్వతీశం కెరీర్ కూడా ఏమి అంత సాఫీగా సాగలేదు. అతని కెరీర్ నిండా ఎన్నో ఆటు పోట్లు, ఒడిదొడుగులు ఉన్నాయి. బ్యాగ్రౌండ్ లేకపోవడంతో కెరీర్ తొలినాళ్లలో అతను కూడా అందరిలాగే సినిమా కష్టాలు పడ్డాడు. అతని లైఫ్ స్టోరీ ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.
1960-70 కాలంలో తెలుగు నాట ఎన్నో కుటుంబాలు ఉద్యోగ రీత్యా, పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్ పూర్ కి వలస వెళ్లాయి. అలా వెళ్లిన వాళ్లల్లో పార్వతీశం తాతగారు కూడా ఒకరు. పార్వతీశం తాతగారిది శ్రీకాకుళం జిల్లా. ఆయన ఓ రైల్వే ఉద్యోగి. పోస్టింగ్ ఖరగ్ పూర్ లో రావడంతో అక్కడే తన కుటుంబంతో కలిసి సెటిల్ అయ్యారు. అక్కడే పార్వతీశం కూడా పుట్టారు. తన స్కూల్ విద్యాబ్యాసం అంతా ఖరగ్ పూర్ లోనే జరిగింది. పార్వతీశం చిన్నప్పటి నుంచి అన్నిటిలోను ఫస్ట్ ఉండేవాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా ఉండేవాడు. పార్వతీశం కి చిన్నప్పటి నుంచి సినిమాలన్నా నాటకాలన్నా పిచ్చి. చిన్నప్పుడు స్కూల్ ఉండగా చాలాసార్లు నాటకాలు వేసి అందరిని అలరించేవాడు. తన నటనకి గాను అక్కడవున్న వాళ్ళందరూ ప్రశంసించేవారు. అలా 10వ తరగతి వరకు ఖరగ్ పూర్ లోనే చదువుకున్న పార్వతీశం, ఇంటర్మీడియట్ మాత్రం విశాఖపట్నం లో పూర్తి చేసాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యను బెంగళూరు లోని ఒక ప్రముఖ కళాశాలలో పూర్తి చేసాడు. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి, అక్కడే బెంగళూరులో కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసాడు. తరువాత ఎందుకో అతను ఆ ఉద్యోగంతో సంతృప్తి చెందక నటుడవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చేసాడు. హైదరాబాద్ కి వచ్చాక అతనికి అసలు కష్టాలు ప్రారంభమైయ్యాయి. సినిమా అవకాశాల కోసం కాళ్ళరిగిపోయేల తిరగని ఆఫీస్ లేదు, చోటు లేదు. ఎక్కడికి వెళ్లిన అతనికి అదృష్టం మాత్రం తలుపుతట్టలేదు. ఎన్ని షాట్ ఫిలిమ్స్ చేసిన, నటించిన గాని అతనికి అవకాశం ఇచ్చేవాళ్ళు కరువైయ్యారు. ఇలా ఒక నాలుగేళ్ళ పాటు ఎంతోమంది సినిమా వాళ్ళని కలుస్తూ, ఎన్నో సినిమా ఆఫీసుసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు. అయినా అవకాశం మాత్రం రాలేదు.
ఈ కష్టకాలంలో అతనికి అతని స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఎన్నో సార్లు పార్వతీశం ని ఆర్థికంగా ఆదుకున్నారు. చివరిగా పార్వతీశం కళ నెరవేరింది. ఇన్నాళ్ల కష్టానికి ఫలితంగా 2015 “కేరింత” సినిమాతో అవకాశం వచ్చింది. కేరింత ఆడిక్షన్స్ కి వెళ్లిన పార్వతీశంకి “నూకరాజు” అనే ఒక మంచి పాత్రకి గాను ఎంపికయ్యాడు . కొంతమంది స్నేహితుల కథే ఈ కేరింత సినిమా.ఇందులో నటించిన అందరి పాత్రలకి సరిసమానమైన స్కోప్ ఉంటుంది. ఇన్నాళ్లు అవకాశం కోసం, ఆహారం కోసం వేటాడే చిరుత పులిలా ఎదురు చుసిన పార్వతీశం, నూకరాజు క్యారెక్టర్లో అదరగొట్టాడు. ఏమి తెలియని అమాయకుడుగా,అచ్చమ్ పల్లెటూరి మొద్దుగా అమాయకుడిగా, ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు పార్వతీశం. “కేరింత” సినిమా అంత పెద్ద హిట్టైయిందంటే దానికి ప్రధాన కారణం నూకరాజు క్యారెక్టర్. నిజానికి ఈ సినిమాలో నటించిన వాళ్లందరికంటే పార్వతీశంకే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత పార్వతీశంకి ఒక్కసారిగా అవకాశాలు వెల్లువెత్తాయి. మిగితా ఎవరైనా దొరికింది కాదా ఛాన్స్ అని అన్ని చేసుకుంటూ పోయేవాళ్లు. కానీ పార్వతీశం మాత్రం అలా కాదు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ నచ్చిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలా వచ్చిన సినిమాలే “రోజులు మారాయి”, “నాన్న- నేను – నా బాయ్ ఫ్రెండ్స్”. రోజులు మారాయి సినిమాలో ఒక భార్యలో మార్పు తీసుకొచ్చే భర్తగా మెపిస్తే, నాన్న- నేను – నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మాత్రం పూజారి పాత్రలో మరోసారి తనదయిన సైలిలో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ మూడు సినిమాలతో ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్నారు. అల్లరి నరేష్ టైపు లో హాస్యాస్పదమైన సినిమాలు చేసే హీరో ఇంకొకడు దొరికాడు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నవేమి జరగలేదు. కేరింత తర్వాత మళ్ళి అలాంటి తరహా పాత్రలు వస్తుండడంతో వాటిని రిజెక్ట్ చేసుకుంటు వచ్చాడు పార్వతీశం.
కొత్తతరహా కధలు, నటుడిగా తనని తానూ ఇంప్రూవ్ చేసుకునే పాత్రల కోసం ఎదురుచూస్తూ ఉన్న పార్వతీశం, ఎట్టకేలకు తన దగ్గరికి ఒక మంచి పాత్ర వచ్చింది. ముకేశ్ అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన “మార్కెట్ మహాలక్ష్మి” అనే సినిమా కథ నచ్చడంతో, ఈసారి హీరోగా మళ్ళీ మనముందుకు వస్తున్నాడు. ఎక్కడో ఖరగ్ పూర్ లో పుట్టి, విశాఖపట్నంలో పెరిగి, బెంగళూరు లో ఇంజనీరింగ్ చేసి, సినిమాల మీద మక్కువతో హైద్రాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించి, కేరింత సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, మళ్ళీ ఇన్నాళ్లకు మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాతో హీరోగా మారిన విధానం చూస్తే అద్భుతం, ప్రశంసనీయం. మన మీద మనకి నమ్మకం, చేసే పని మీద శ్రద్ద ఉంటే ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాం అన్నది పార్వతీశం లైఫ్ జర్నీ ని చూసి నేర్చుకోవచ్చు. బ్యాగ్రౌండ్ లేని ఎంతోమంది సినిమాల్లో ప్రయత్నించే వాళ్ళకి పార్వతీశం జీవితం ఒక ఆదర్శం. పార్వతీశం ఇలాగే మరోన్నో గొప్ప గొప్ప పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే హీరోగా తన తొలి ప్రయత్నం అయిన “మార్కెట్ మహాలక్ష్మి” సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
Wishing him all the best
రైటర్: నవీన్ మాదినేని