భారతీయ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఆయతో చిత్రం అంటే నిర్మాతలకి కత్తిమీద సాము లాంటిది. సినిమా చిత్రీకరణ కన్నా పాటల చిత్రీకరణకు, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు శంకర్. అందుకనే ఆయన 30 ఏళ్ళ సినీ జీవితంలో కేవలం 12 చిత్రాలు మాత్రమే తీయగలిగారు. ఏళ్ళకి ఏళ్ళు చిత్రీకరణలోనే గడిపే ఆయన నుంచి రెండు చిత్రాలు వెంటవెంటనే వస్తున్నాయి అంటే ఆశ్యర్యమే. రెండు దశాబ్దాల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ తో తెరకెక్కించిన భారతీయుడు ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది భారతీయుడు 2. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించటం విశేషం.
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన మొదటి భాగంలో పాటలు ఎంతటి అద్భుతాలు సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. కొనసాగింపు కథకి కూడా అప్పటి సంగీత దర్శకుడు రెహమాన్ కాకుండా అనిరుద్ ని ఎంచుకున్నందుకు శంకర్ మీద కొంతమంది పెదవి విరిచారు కూడాను. కొందరైతే రెహమాన్ అందించిన అద్భుతమైన పాటలలో 30% శాతం అయినా అనిరుధ్ అందిస్తే గొప్ప అనుకున్నారు. కానీ అనిరుధ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటిదాకా రెండు పాటలు విడుదల చేసారు చిత్రం బృందం. “సౌరా” అనేది ఒక యుద్ధ ప్రణాళిక సంబంధిత సైనిక సోదరులకు సంబందించిన పాట. సంగీతం, సాహిత్యం అమోఘంగా ఉన్నాయి. వింటుంటేనే వెనువెంటనే వెళ్ళి సైన్యంలో చేరాలనిపించేలా ఉన్నది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు ఈ పాటకి. రెండోవది ఒక ప్రేమగీతం. “చెంగాలువ” అంటూ సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి గారు రచించారు. రెండు పాటలు కూడా ఎప్పటినుంచో వింటూ వస్తున్న అనిరుధ్ స్వరపరచిన విధానంలో కాకుండా ఒక కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి. కమల్ సార్ అభిమానులు, శంకర్ అభిమానులు, యావత్ సంగీత ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనిరుధ్ పనితనానికి. జులై లో విడుదలకి సిద్దమైన ఈ చిత్రం ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. అనిరుధ్ మాత్రం తనని ఈ చిత్రానికి తీసుకోవటం అనే నిర్ణయం తప్పు కాదని నిరూపించారు. ఇది నిజంగా మెచ్చుకోతగ్గ తరుణం. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 1న జరగబోతోంది.