జూన్ 27న డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా నటించిన చిత్రం కల్కి 2898 AD విడుదల అయ్యి రికార్డ్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం చేసిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ గారు నిర్మించారు ఆయన కుమార్తెలు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పుడు జులై 12న ఇంకో ప్రభంజనం రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ నుంచి 28 సంవత్సరాల క్రితం వచ్చిన అద్భుతమైన చిత్రం భారతీయుడు. పాటలు, పోరాటాలు, కథ, కథనం ఇలా అన్ని వర్గాలవారిని అలరించింది ఈ చిత్రం. ఇప్పుడు ఆ చిత్రానికి ఇప్పటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని కొనసాగింపుగా రాబోతోంది తదుపరి భాగం భారతీయుడు 2. సిద్ధార్థ్, రకుల్, ప్రియా, SJ సూర్య ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మొదటి భాగానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా పాటలు అన్నీ సూపర్ హిట్.
ఇప్పటి కొనసాగింపుకి రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందనే వస్తోంది. కల్కి ఇచ్చిన అద్భుతమైన పూర్వ వైభవాన్ని ఈ చిత్రం కొనసాగిస్తుంది అని అందరూ నమ్ముతున్నారు. నిన్ననే ప్రీ-రిలీజ్ ఈవెంట్ తెలుగు లో నిర్వహించిన ఈ చిత్ర బృందం చిత్రం విజయం పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తున్నారు. కమల్ గారు కూడా, ఈ చిత్రం చెయ్యటానికి ముఖ్య కారణం ఈ చిత్రం యొక్క మూడోవ భాగం అని చెప్పారు. ఈ చిత్రం నుంచి 6 నెలల తరువాత మూడోవ భాగం రాబోతోంది. ఇప్పటికైతే రెండొవ భాగం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకోబోతోందో చూడాలి. కమల్ గారికి భారతీయుడు ద్వారా వచ్చిన ప్రపంచం ఖ్యాతిని ఈ రెండు భాగాలు కాపాడతాయనే ఆశిద్దాం.
ఈ చిత్రం తరువాత రామ్ పోతినేని నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న విడుదలకి సిద్ధంగా ఉంద. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, చార్మీ కౌర్ తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. మొదటి భాగం అయిన ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపు ఈ చిత్రం. ఈ చిత్రం ట్రైలర్ ఇంకా మొదటి పాట విడుదల అయ్యి మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రం విజయం పట్ల కూడా చిత్ర బృందం గట్టిగానే విశ్వాసంతో ఉన్నారు. ఇలా చూసుకుంటూ వెళితే చాలా చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వేచి చూడాలి మరి, వచ్చే రెండు నెలలలో ఎంతటి విజయాలు వివిధ చిత్రాలు సొంతం చేసుకుంటాయో.