ఆగష్టు 15 ఒకవైపు దేశమంతా జెండా పండుగ సంబరాలు జరిగితే, తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూడు సినిమాల సమరం జరగబోతుంది. “మిస్టర్ బచ్చన్” తో రవితేజ, “డబుల్ ఇస్మార్ట్” తో రామ్, “తంగలాన్” తో విక్రమ్ ముగ్గురు బాక్సాఫీస్ పై దండయాత్ర కు సిద్ధమైయ్యారు. అయితే ఈ మూడు సినిమాలో ప్రధాన పోటీ మాత్రం “మిస్టర్ బచ్చన్”-“డబుల్ ఇస్మార్ట్” సినిమాల మధ్యే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముగ్గురు హీరోస్ కి విజయం అవసరమే. ఎందుకంటే రవితేజ కి రెండేళ్లుగా హిట్ లేదు, రామ్ హిట్ కొట్టి ఐదేళ్లు దాటిపోయింది, ఇంకా తమిళ్ హీరో విక్రమ్ అయితే తన లాస్ట్ హిట్ అపరిచితుడు 2005. అప్పటి నుంచి ఇప్పటి వరకు విక్రమ్ కి హిట్ లేదు. ఇంకా విచిత్రమేంటంటే ఈ మూడు సినిమాల డైరెక్టర్స్ కూడా హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. అందుకే ఈ మూడు సినిమాలు అటూ హీరోస్ కి మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా కీలకమే. ముఖ్యంగా “డబుల్ ఇస్మార్ట్” సినిమా పైనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ఆధారపడి ఉంది. మరి ఈ మూడు సినిమాల సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.
- మిస్టర్ బచ్చన్
పోటీలో “డబుల్ ఇస్మార్ట్”, “తంగలాన్” సినిమాలు ఉన్నపటికీ హావా మొత్తం రవితేజ “మిస్టర్ బచ్చన్” సినిమాదే. ఎందుకంటే రవితేజ చాలాకాలం తర్వాత తనకి బాగా కలిసొచ్చిన మాస్ ఎంటర్టైన్ సినిమా చేయడం. అందులోనూ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండడం. పైగా బాలీవుడ్ సూపర్ హిట్ “రైడ్” సినిమా రీమేక్ కావడం, రీమేక్ సినిమాలని హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ కి మంచి పేరుండడం. ఇన్నీ కలిసొచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టే “మిస్టర్ బచ్చన్” సినిమాని మిగితా రెండు సినిమాల కంటే ముందు నిలబెడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ కూడా బాగుండడంతో సినిమా పై పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి. “ధమాకా” సినిమా తర్వాత రవితేజ కి వరుసగా మూడు ప్లాప్స్. హరీష్ శంకర్ సినిమా వచ్చి 5ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా “మిస్టర్ బచ్చన్” సినిమా కి మంచి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంటే దానికి ప్రధాన కారణం రవితేజ- హరీష్ శంకర్ కాంబినేషన్.
- “డబుల్ ఇస్మార్ట్”
2019లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” పూరీ స్థాయి సినిమా కాకపోయినప్పటికీ ప్లాపుల్లో ఉన్న పూరీ ని మాత్రం గట్టేకించింది. మరి దాని సీక్వెల్ గా వస్తున్నా “డబుల్ ఇస్మార్ట్” సినిమా హిట్టవుతుందా అంటే సందేహమే. ఎందుకంటె “ఇస్మార్ట్ శంకర్” సినిమా రిలీజప్పుడే నెగటివ్ టాక్, నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా కూడా సినిమా ఆడిందంటే సినిమాలో ని సాంగ్స్, హీరోయిన్స్ గ్లామర్ షో వల్లే సినిమా ఎలాగోలా హిట్టైయింది. ప్రతిసారి అదే జరుగుతుందని చెప్పలేం పైగా “ఇస్మార్ట్ శంకర్” రిలీజైనప్పుడు పోటీలో మరో సినిమా లేదు. కానీ ఈసారి పోటీలో “మిస్టర్ బచ్చన్”, “తంగలాన్” సినిమాలున్నాయి. కాబట్టి ఈసారి పూరీ జగన్నాథ్ సినిమా కి అంత ఈజీ కాదు. వీటన్నిటికీ తోడు “లైగర్” సినిమా డిస్టిబ్యూటర్స్ సమస్య మరొకటి ఉంది. “లైగర్” సినిమాని కొన్న నైజాం డిస్టిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. “లైగర్” నష్టాలని భర్తీ చేయకపోతే “డబుల్ ఇస్మార్ట్” సినిమా రిలీజ్ ని అడ్డుకుంటాము అంటూ పూరి – ఛార్మి లకి హెచ్చరికలు కూడా వెళ్లాయి. ఇన్ని సమస్యల మధ్య “డబుల్ ఇస్మార్ట్” సినిమా రిలీజై ఘన విజయం సాధించాలి. లేదంటే ఇంకా పూరీ-జగన్నాథ్ కెరీర్ ఖతమైనట్లే. అటూ రామ్ కి కూడా “ఇస్మార్ట్ శంకర్” తర్వాత ఒక్క హిట్ లేదు. కాబట్టి ఈ సినిమా విజయం రామ్ కి కూడా అవసరమే.
- “తంగలాన్”
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఎంత ప్రయత్నించిన అతని సినిమాలు మాత్రం హిట్ అవ్వడం లేదు. అప్పుడెప్పుడో 2005లో వచ్చిన “అపరిచితుడు” సినిమా విక్రమ్ కెరీర్లో పెద్ద హిట్. ఆ సినిమా వచ్చి 20ఏళ్ళు అయిపోయింది. కానీ ఇంతవరకు మరో హిట్ మాత్రం పడలేదు. ఈ 20ఏళ్లలో విక్రమ్ ఎన్నో గొప్ప చిత్రాలు చేసాడు. “నాన్న” వంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు, శంకర్ తో రెండో సారి పని చేసాడు. ఆఖరికి తన కొడుకుతో కూడా కలిసి నటించాడు. అయినా కూడా విజయం విక్రమ్ తలుపు తట్టడం లేదు. ఇన్నేళ్లుగా హిట్ లేకపోయిన నిర్మాతలు ఇంకా విక్రమ్ తో సినిమాలు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం విక్రమ్ యాక్టింగ్. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలడు. ఈసారి కూడా “తంగలాన్” సినిమాలో మరో కొత్త పాత్రలో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైనా టీజర్లో విక్రమ్ సరికొత్త గేటప్ లో అదరకొట్టాడు. రజినీకాంత్ తో “కబాలి”, “కాలా” వంటి సినిమాలు తీసిన పి.రంజిత్ ఈ సినిమా దర్శకుడు. మరి చూద్దాం సుదీర్ఘకాలంగా ఒక్క హిట్ కోసం ప్రయత్నిస్తున్న విక్రమ్ కు ఈ “తంగలాన్” సినిమా హిట్ దాహం తీరుస్తుందో లేదో.