కొత్త దర్శకులకి పోటీగా అనుభవం ఉన్న దర్శకులు కూడా ప్రయోగాత్మకమైన చిత్రాలని తెరకెక్కించటం మొదలు పెట్టారు. తమిళ దర్శకుడు శివ తన కుటుంబ తరహా మాస్ చిత్రాల పంధా నుంచి బయటకొచ్చి ఒక కొత్తరకమైన కథాంశంతో, సూర్య గారితో మనముందుకు రాబోతున్నారు. అదే “కంగువా”. సూర్య గారి సరసన అందాల భామ దిశా పఠాని నటిస్తున్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా మొదటిసారి తమిళ తెరమీద మెరవబోతున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కె.ఈ. జ్ఞానవేళ్ రాజా, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పాత్రలో సూర్య నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్య గారిని ఇలాంటి ఒక దళారిపతి పాత్రలో ఎన్నడూ చూడలేదు. ట్రైలర్ లో ఆయన వేషధాన, నడవడిక, మాట్లాడే విధానం అంతా కొత్తగా ఉన్నాయి. పోరాట సన్నివేశాలు అయితే వర్ణనాతీతం. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అడవి బాక్గ్రౌండ్ గా వస్తున్న ఈ చిత్రానికి మూల స్థంభం గ్రాఫిక్స్.
ప్రతీ సన్నివేశంలో మనం చూసిన గ్రాఫిక్స్ ఒక హాలీవుడ్ చిత్రాన్ని తలపించాయి. ముఖ్యంగా చివరిలో వచ్చిన మొసలి సీన్ అయితే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. ఒక బెదురు, దేనికీ జంకని , మొండిఘటమైన ఒక దళానికి చెందిన దళారిపతిగా సూర్య ఒక మెరుపు మెరిశారు. బాబీ డియోల్ గారి వేషధారణ చాలా కొత్తగా, భయంకరంగా ఉంది. వీళ్ళ ఇద్దరి ట్రైలర్ లో ఇంట్రొడక్షన్ ఏ అద్భుతంగా ఉంటే, నిజముగా సినిమాలో ఎలా ఉండబోతోంది అనే ఆలోచన మన ఊహకి కూడా అందదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నిషద్ యూసుఫ్ ఎడిటింగ్ ప్రతిభ చూపించారు. ఈ చిత్రానికి మూల కథని ఆది నారాయణ అందించగా, శివ తనదైన శైలిలో తెరకెక్కించే ప్రయత్నం చేసారు. ట్రైలర్ లో ప్రతీ షాట్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ మొత్తం పోరాట సన్నివేశాలతో నిండిపోయి ఉంది. చివర్లో వచ్చే ఒక ట్విస్ట్ థియేటర్లో చూడాల్సిందే అనుకుంటాను. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతోంది. హిట్ కోసం పరితపిస్తున్న శివ గారికి ఈ చిత్రం ఎలాంటి గుర్తింపును తెస్తుందో వేచిచూద్దాం. ఈ చిత్రానికి రెండొవ భాగం కూడా ఉంది. 2026 లో అది విడుదల అయ్యే అవకాశం ఉందని నిర్మాత ద్వారా తెలిసిన విషయమే.