రివ్యూ బై: సాయిరాం తాడేపల్లి
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
చిత్రం: “అమరన్”
రేటింగ్: 3.75/5
బాటమ్ లైన్: “A pure war of love, career, country, courage – A must watch master piece.”
నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా, లల్లూ, మీర్ సల్మాన్, అజయ్ నాగ రామన్, శ్యామ్ మోహన్ తదితరులు.
ఎడిటర్: ఆర్. కలైవనన్
మ్యూజిక్ డైరెక్టర్: జివి ప్రకాష్
సినిమాటోగ్రఫీ: సతీష్ కృష్ణన్
ప్రొడక్షన్: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా
నిర్మాత: కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
రచన-దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి
ఒక మనిషి విలువ వాళ్ళు ఉన్నప్పుడు కన్నా, వాళ్ళు మనతో ఇంక ఉండరు అనే నిజాన్ని తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఒక సైనికుడి జీవితం కూడా అంతే. ఎన్నో విలువైనని వదులుకుని ఆ వృత్తిలోకి వెళతారు. వాళ్ళు వదులుకున్న వాటికన్నా దేశాన్ని, దేశ ప్రజలని రక్షించటమే లక్ష్యంగా పెట్టుకుని కంటిమీద కునుకు లేకుండా దేశానికి కావాలి కాస్తారు. అలాంటి ఒక అద్భుతమైన సైనికుడి కథనే “అమరన్”. మేజర్ ముకుంద్ వరదరాజన్ తన జీవితాన్ని ధారపోసి చేసిన పోరాటమే ఈ కథ. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, ప్రేమ సహనాన్ని నేర్పిస్తుంది, ప్రేమ పరీక్షలు పెడుతుంది, ప్రేమ తెగింపుని నేర్పిస్తుంది. కానీ ఈ ప్రేమ కథలో ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఒక దెస పౌరుడికి దేశం మీద ఉండాల్సిన ప్రేమ చక్కగా చూపించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. నిజజీవిత పాత్రల్లో శివకార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ గా సాయి పల్లవి నటించి మెప్పించారు. జి వి ప్రకాష్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ తో కలిసి లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాత బాధ్యతలని తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్మించారు. ఈ చిత్రం ఈరోజు దివాళి సందర్భంగా మన ముందుకి వచ్చింది. ఈ చిత్రం యొక్క విశ్లేషణ ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ముకుంద్ (శివ కార్తికేయన్) తన 5 వ తరగతిలోనే ఒక సైనికుడు అవ్వాలని నిర్ణయించుకుంటాడు. దానిగురించి కస్టపడి చదువుకుంటాడు. తను చదువుతున్న కాలేజీలో చేరిన ఇందు రెబికా వర్గీస్ (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు ముకుంద్. ఇందు కూడా తన కళని అర్థం చేసుకుని తనకి అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో ముకుంద్ వాళ్ళ కుటుంబానికి ఇందు బాగా నచ్చుతుంది. వాళ్ళ ప్రేమ, పెళ్లి విషయాలలో వచ్చిన సమస్యలని, కెరీర్ పరంగా ఎదురవుతున్న సమస్యలని ఎగురుకుంటూ ఇద్దరూ ఎదుగుతారు. ఈ క్రమంలో ముకుంద్ తనకి ఊహించని ఒక వింగ్ లో పోస్టింగ్ ఇస్తారు, ఆ పనిమీద కాశ్మీర్ వెళ్లాల్సి వస్తుంది. కెరీర్ లో అంచలంచలుగా ఎదుగుతున్న తరుణంలో ఒక అనుకోని ప్రత్యర్థిని ఎదురుకోవాల్సివస్తుంది. ఈ పోరాటంలో తనకి తోడుగా ఎంతో మంది ఉన్నప్పటికీ చివరికి ముకుంద్ గెలిచాడా? ముకుంద్ జాయిన్ అయిన ప్రతిష్టాత్మకమైన వింగ్ ఏంటి? కాశ్మీర్ లో ముకుంద్ కి ఎదురైన సమస్య ఏమిటి? ముకుంద్ కుటుంబానికి తీరని విషాదాన్ని కలిగించిన విషయం ఏమిటి? వీటన్నిటికీ జవాబులు తెలియాలంటే “అమరన్” చూడాల్సిందే.
కథనం:
ఇందు (సాయి పల్లవి) ప్రకారం కథ మొదలు పెట్టి, పరిచయం, ప్రేమ, ప్రయాణం అద్భుతంగా చూపించారు దర్శకులు. ఒక యంగ్ జనరేషన్ ప్రేమ కాకుండా ఒక పరిణితి చెందిన యువకుల కథలా ఉంటుంది. చిన్ని చిన్ని అడుగులు వేస్తున్న ప్రేమకథలోకి అనుకోని సంఘటనలు చోటుచేసుకోవడం, ఒక ప్రేమ జంటకి ఉండే సమస్యలు, బెదిరింపులు, బెంగ, అలకలు, కోపాలు, ప్రేమలు అన్నీ కూడా అద్భుతంగా కనపరిచారు శివ కార్తికేయన్, సాయి పల్లవి గారు. ఇద్దరి మధ్య జరిగిన ముఖ్య అంశాలతో కథ నడుస్తూ ఉంటుంది, నెమ్మదిగా ముకుంద్ కళ, ఇందు కంటూ ఉంటుంది, ఇందు సమస్య తన భుజాలమీదకి తీసుకుంటాడు ముకుంద్. ప్రేమలో ఉండే ముఖ్యమైన అంశం బాధ్యతని చాలా చక్కగా చూపించారు మొదటి భాగంలో. అద్భుతమైన పోరాట సన్నివేశాలతో మొదటి భాగం ముగుస్తుంది.
జరిగిన పోరాటానికి ప్రతి ఘటన చేసే ప్రక్రియలో ముకుంద్ చూసిన దారుణమైన సంఘటనలు, ఇందు యొక్క విరహం, వాళ్ళు నటించిన విధానం చూడటానికి కనుల విందుగా ఉంటుంది. శివ కార్తికేయన్ గారైతే నిజమైన సైనికుడిగా జీవించేసారు. రెండొవ అధ్యాయం మొత్తం పోరాటాలు ఎత్తుకి పైఎత్తులు, కుటుంబంలో కలుగుతున్న భయాలు చూపించిన విధానానికి కన్నులు చమరుస్తాయి.
నటీనటుల పెర్ఫార్మన్స్:
మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో ప్రాణం పెట్టారు శివ కార్తికేయన్. ఆయన భార్యగా సాయి పల్లవి నిజమైన ఇందు రెబెకా వర్గీస్ వలెనె నటించి మెప్పించారు. ఆవిడ పాత్రకి ప్రతీ సైనికుడి భార్య కనెక్ట్ అవుతారు. ప్రతీ ఫ్రేములో వాళ్ళు నటించలేదు, దేశం కోసం కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్న సైనికుడి బాధని, దేశసేవకి వెళ్లిన భర్త గురించి ఎలాంటి వార్త వినాల్సివస్తుందో అని ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతికే భార్యగా విశ్వరూపం చూపించారు. ముకుందన్ తల్లిగా చేసిన గీత గారుకూడా ఆవిడవంతు మంచి నటనని కనపరిచాడు. ముఖ్యంగా చెప్పుకోవలసింది విక్రమ్ సింగ్ పాత్ర పోషించిన భువన్ అరోరా, కల్నల్ అమిత్ సింగ్ గా నటించిన రాహుక్ బోస్ ఆకట్టుకుంటారు. క్లైమాక్స్ లో భువన్ నటన అమోఘం. మిగతా పాత్రధారులు కూడా వాళ్ళకి తగ్గ పెర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చి ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా రాసుకున్న దర్శకుడికి నిజంగా మన అందరం రుణపడి ఉంటాం. రాజ్ కుమార్ పెరియసామి గారు పాత్రలకి ప్రాణం పోసిన విధానం ముచ్చటగా ఉంటుంది. తెరమీద ప్రేమ సన్నివేశం అయినప్పటికీ, పోరాట సన్నివేశం అయినప్పటికీ ఎలాంటి బేధం లేకుండా సమన్యాయం చేసారు సంగీత దర్శకులు జి వి ప్రకాష్. ఆయన అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మంచి ఆయుధంలా పనిచేసింది ఈ చిత్రానికి. పోరాట సన్నివేశాలు, నిర్మాణ విలువలు ఎక్కడా కొదవ లేకుండా ఉన్నాయి. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా మెచ్చుకోవలసిందే.